తమ భూమి రాజధానిలో లేదని... హెరిటేజ్ స్పష్టం చేసింది. తాము అసలు రాజధాని ఎక్కడ వస్తుందో తెలియకముందే గుంటూరు, విజయవాడ నగరాల్లో భూములు కొనుగోలు చేశామని... అది కూడా డెయిరీ ప్లాంట్లు పెట్టడం కోసం కొనుగోలు చేశామని.. అంతే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కాదని హెరిటేజ్  కంపెనీ అధ్యక్షుడు ఎం. సాంబశివరావు వివరణ ఇచ్చారు.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హెరిటేజ్ అక్రమంగా భూములు కొనుగోలు చేసిందంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఆయన ఆరోపణలపై హెరిటేజ్ స్పందించింది.

Also Read: AP Three Capitals : రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు

తాము కొన్న భూమి రాజధాని ప్రాంతంలో లేదని, దానికి 20 కి.మీ. దూరంలో ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియక ముందే ఈ ప్రాంతంలో భూమి కొనుగోలుకు తమ సంస్థ నిర్ణయం తీసుకుందని, రాజధాని ఎక్కడో తేలక ముందే భూమిని కొనుగోలుచేసిందని వెల్లడించారు.

గుంటూరు జిల్లాలో రేపల్లెలో మా సంస్థకు ఒక డెయిరీ ప్లాంటు ఉందన్నారు.వ్యాపార విస్తరణలో భాగంగా 2014లో అనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భూములు కొన్నామని చెప్పారు.  గుంటూరు... విజయవాడ చుట్టుపక్కల మరో ప్లాంటు పెట్టడానికి 2013లోనే భూమి కోసం అన్వేషణ మొదలు పెట్టామన్నారు. గుంటూరు చుట్టుపక్కల కొనుగోలు చేయాలని 2014 మార్చి 21న జరిగిన బోర్డు డైరక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

అప్పటికి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదని.. అసలు ఎవరు గెలుస్తారో కూడా  తమకు తెలియదన్నారు. తమ వ్యాపార అవసరాల కోసం గుంటూరుకు సమీపంలో తాడికొండ మండలం కంతేరు గ్రామ పరిధిలో మొత్తం ముగ్గురు భూ యజమానుల నుంచి సుమారుగా 14 ఎకరాల భూమిని జూలై, ఆగస్టు నెలల్లో కొనుగోలు చేశామని చెప్పారు. రాజధాని ఎక్కడో ఆ తర్వాత డిసెంబరులో ప్రకటన వచ్చిందని చెప్పారు.

Also Read: ఏపీ రాజధాని: అమరావతిని చీకి పాతరేసిన వైఎస్ జగన్

తాము రాజధానిలో అక్రమంగా భూమి కొనుగోలు చేశామన్న ఆరోపణ సరికాదని, తమ కొనుగోలుకు, ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు. గత 27 ఏళ్లుగా తమ సంస్థ కొన్ని విలువలకు కట్టుబడి పనిచేస్తోందని, ఆధారం లేని ఆరోపణలు చేయడం తగదని తెలిపారు.