Asianet News TeluguAsianet News Telugu

ఇకపై పవన్‌ కళ్యాణ్‌ మకాం అక్కడే.. స్థలం కూడా కొనేశారు

ఎన్నికల ముందు నుంచే పవన్ కళ్యాణ్ పిఠాపురంపై దృష్టిపెట్టారు. అక్కడే ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడం, డిప్యూటీ సీఎం అయిపోవడంతో ఆ పనులు ఇంకాస్త వేగం చేశారు.

Henceforth, Pawan Kalyan's residence is there.. They also bought the place GVR
Author
First Published Jul 4, 2024, 9:45 AM IST

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ రెండురోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. గొల్లప్రోలులో పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు బుధవారం ఉప్పాడ సముద్ర తీరం సహా పలు మంచినీటి పథకాలను పరిశీలించారు. ఉప్పాడలో తీర ప్రాంత సమస్యతో పాటు శుద్ధమైన తాగునీటి పంపిణీకి సంబంధించి అధికారులకు కీలక అదేశాలిచ్చారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన వారాహీ బహిరంగ సభలో పవన్‌ కళ్యాణ్‌ పలు కీలక విషయాలు వెల్లడించారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని వైసీపీ వాళ్లంటే... పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేశారని సంతోషం వ్యక్తం చేశారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన ఈ గెలుపు చాలా గొప్పదని.. ఈ విజయంతో ఢిల్లీ స్థాయిలో కూటమి గౌరవం పెరిగిందని తెలిపారు. పిఠాపురాన్ని దేశం మొత్తం మెచ్చేలా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే, అధికారం వచ్చిందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరించొద్దని జనసేన శ్రేణులకు పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. వైసీపీ మాదిరిగా కక్ష సాధింపు చర్యలు వద్దన్నారు. 

అలాగే, ‘‘పిఠాపురం నా సొంత ఊరు అయిపోయింది. ఇక్కడే 3 ఎకరాల స్థలం తీసుకున్నా. నా క్యాంపు కార్యాలయం, అలాగే పిఠాపురం ప్రజలు ఎప్పుడు వచ్చినా వారి సమస్యలు వినేందుకు తగిన సిబ్బందిని నియమిస్తున్నా. విద్య, వైద్యం, ఉపాధి, తాగు, సాగునీరు అంశాలకు ప్రాధాన్యం ఇస్తాం. పార్టీ శ్రేణులకు, నాయకులకు ఒకటే చెబుతున్నా. గెలిచామనే గర్వంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు, దౌర్జన్యాలు చేస్తే ఊరుకోను. సోషల్ మీడియాలోనూ ఇష్టానుసారం పోస్టులు పెట్టొద్దు. గత ప్రభుత్వం చేసిన తప్పును మనం చేయొద్దు’’ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

కాగా, ఎన్నికల ముందు నుంచే పవన్ కళ్యాణ్ పిఠాపురంపై దృష్టిపెట్టారు. అక్కడే ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడం, డిప్యూటీ సీఎం అయిపోవడంతో ఆ పనులు ఇంకాస్త వేగం చేశారు. ఇప్పటికే పిఠాపురంలో ఇల్లు కట్టుకునే సన్నాహాల్లో భాగంగా మూడెకరాలు కొన్నట్లు పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. ఆ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ బుధవారం పూర్తయినట్లు తెలుస్తోంది. పిఠాపురం మండలం భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో దాదాపు మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో రెండు బిట్లు పవన్‌ కళ్యాణ్‌ కొన్నారని సమాచారం. ఈ మూడున్నర ఎకరాల్లో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు నిర్మించనున్నారు. మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని పిఠాపురంలో మకాం వేయనున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios