గుంటూరు: కరోనా విజృంభణ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు  ఆర్థిక సాయం ప్రకటించాలని టిడిపి జాతీయ కార్యదర్శి  నారా లోకేష్ డిమాండ్ చేశారు.  కేవలం 14 రోజుల క్వారంటైన్ లో వున్నవారికే కాకుండా  సెల్ఫ్ క్వారంటైన్ లో వున్నావారికీ  ఆర్థికసాయం ప్రకటించి ఆదుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు లోకేష్. 

''14 రోజుల క్వారంటైన్ పూర్తయిన పేదలకు 2 వేల ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం. మరి లాక్ డౌన్ కారణంగా 40 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్న పేదల పరిస్తితి ఏంటి? ఇప్పటికే 23 రోజులుగా పనులు లేక, అప్పు పుట్టక పేదలు ఇబ్బంది పడుతున్నారు'' అంటూ నిరుపేదల సమస్యలను జగన్ సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు మాజీ మంత్రి  నారా లోకేష్. 
 
''తక్షణమే 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి పేదలను ఆదుకోవాలి. కేంద్రం ప్రకటించిన సాయం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించాలి. వైకాపా నాయకుల మాటల్లో తప్ప క్షేత్రస్థాయిలో రైతుకి గిట్టుబాటు ధర రావడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోల్లు లేక రైతుకి నిరాశే మిగులుతుంది'' అని ఆరోపించారు. 
  
''ఇక అరటి, మామిడి రైతుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తక్షణమే ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి. అకాల వర్షాల కారణంగా పంట నష్టం అంచనా లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే పంట నష్టం అంచనా పూర్తి చేసి రైతులకు పరిహారం చెల్లించాలి'' అని నారా లోకేష్ వైసిపి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.