ఆంధ్ర ప్రదేశ్ లో మరో 24 గంటల్లో భారీ నుండి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

విశాఖపట్నం : ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఆంధ్ర ప్రదేశ్ కు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. రాష్ట్రానికి వర్షం ముప్పు పొంచివుందని... రానున్న 24గంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. వర్షాలతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని... ప్రమాదకరంగా ప్రవహించే నదులు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అత్యవరం అయితేనే ఇళ్లనుండి బయటకు రావాలని అధికారులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు. 

దక్షిణ ఒడిశా, ఉత్తరకోస్తా తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుందని... దీనికి తోడుగా సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా గుజరాత్ నుండి కేరళ వరకు తీర ద్రోణి... ఉత్తర కోస్తా శ్రీకాళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు-పడమర ద్రోణి విస్తరించి వుందని తెలిపారు. వీటన్నింటి ప్రభావంతో పాటు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో మరో 24గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తాలో కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు... ఒకటిరెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. దక్షిణ కోస్తాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నారు రాయలసీమతో పాటు మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. 

Video ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరదనీరు... 30గేట్లెత్తి దిగువకు నీటి విడుదల

ఇక బలమైన గాలులతో సముద్రం అల్లకల్లోలంగా వుండే అవకాశాలున్నాయని... మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీరంవెంబడి కూడా బలమైన గాలులు వీస్తున్నందును తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతోనే రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటూ మరో అల్పపీడనం ఏర్పడు అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 12 లేదా 13వ తేదీల్లో అంటే మంగళ, బుధవారాల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఇక ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, జలాశయాలు వరదనీటితో నిండుకుండలా మారాయి. వరద నీరు పోటెత్తడంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ ఇన్ ప్లో 26,848 క్యూసెక్కులు కాగా 4,948 క్యూసెక్కుల నీటిని కాలువలకు, మిగతా 21,900 క్యూసెక్కుల సర్ ప్లస్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజి 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి ఈ నీటిని వదులుతున్నారు అధికారులు. 

తాజా వర్షాలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఆకస్మికంగా వరద ఉదృతి పెరిగి పనులను ఆటంకం కలిగిస్తోంది. పోలవరం స్పిల్ వే దగ్గర గోదావరి నీటిమట్టం 29.4మీటర్లకు చేరింది. దీంతో ప్రాజెక్ట్ నుండి 4 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు వదులుతున్నారు. ఇక ఈ వరద ఉదృతి మరింత పెరిగి 12లక్షల క్యూసెక్కులకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. వర్షాకాలం ఆరంభంలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మరింత ఆలస్యం కానుంది.