మంగళవారం అర్ధరాత్రి నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని పలుప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉద్రిక్త వాతావారణం చోటుచేసుకున్న అమలాపురంలో వర్షం కురిసింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మరోసారి వాతావరణం చల్లబడింది. ఈ నెల ఆరంభంలో ఆసాని తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసి మండుటెండటలతో సతమతం అవుతున్న ఏపీ ప్రజలకు చల్లబర్చాయి. ఆ తర్వాత మళ్లీ భానుడి భగభగలు మొదలవగా మరోసారి ఏపీని వర్షాలు పలకరించాయి. మంగళవారం అర్ధరాత్రి నుండి ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తూ వాతావరణాన్నిచల్లబర్చాయి. 

ఎన్టీఆర్ జిల్లా మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు మండల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనూ రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. అనకాపల్లి, చోడవరం, వడ్డాది, మాడుగుల, చీడికాడ.., విశాఖపట్నంలోని పెందుర్తి ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. భారీ వర్షం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా మండుటెండల నుండి ఉపశమనం కలిగిస్తున్నాయి. 

ఇక కోనసీమ జిల్లా పేరుమార్పు విషయంలో తీవ్ర విద్వంసం చోటుచేసుకున్న అమలాపురంలోనూ రాత్రి నుండి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడి రోడ్లపై పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం వర్షం తగ్గడం, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి లేకపోవడంతో సాధారణ వాతావరణం ఏర్పడింది. 

ఏపీతో పాటు తమిళనాడు, తెలంగాణ, బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. గత ఐదారు రోజులగా వర్షాలు కురుస్తున్నా మంగళవారం వర్షతీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇంకా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి సూచించింది. 

గత శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో 11.2 సెం.మీ, బంట్వారంలో 11 సెం.మీ, దుద్యాలలో 10.2 సెం.మీ వర్షం కురిసింది.

 ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలో కూడా గత శుక్రవారం భారీ వర్షాలు కురిసాయి. పలుప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరెంట్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అకాల వర్షం వల్ల చేతికి వచ్చే పంట నీటి పాలయింది.

అంతకుముందు ఆసనీ తుఫాను ఏపీని అతలాకుతలం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసాయి. ముఖ్యంగా ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ, అతిభారీవర్షాలు వర్షాలు కూడా కురిసాయి.