విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో బలపడనుందని... దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. 

కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలను వర్షాలు ముంచెత్తడమే కాదు తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు గాలులు వీచే అవకాశమున్నట్లు సమాచారం. 

read more    తెలుగు ప్రజలకు శుభవార్త... ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

ఈనెల 11,12న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇక రుతుపవనాలు రాయలసీమను పూర్తిగా ఆవరిస్తున్నాయని... కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలను ఇవి తాకనున్నాయని వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణను కూడా ఇవి చేరుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఈనెల 10-12 తేదీల్లో ఉత్తరాంధ్ర, తెలంగాణల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. నేడు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో‌ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. సముద్రం‌ అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు పోరాదని వాతావరణ శాఖ వెల్లడించింది.