కర్నూల్: శ్రీశైలం ఆనకట్ట సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆనకట్ట ప్రవేశద్వారం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. రాత్రి వేళ కావడంతో పైనుంచి పెద్ద బండరాళ్లు జారిపడ్డప్పటికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

అయితే ఆలయ ఉద్యోగులు,  భక్తులు, పర్యాటకులు రాకపోకలు సాగించేచోట ఈ విధంగా బండరాళ్లు పడటం ఆందోళన కలిగిస్తోంది.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొండచరియలు విరిగిపడే చోట కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు ఇలా కురిసిన భారీ వర్షాలకు బాగా నానడంతో కొండచరియలు విరిగి పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. 

ఇక ఎగువ పరివాహక ప్రాంతాలలో రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఆయా ప్రదేశాల్లో జలాశయాలు క్యాచ్మెంట్ ఏరియాలలో ఆశించినంతగా భారీ వర్షాలు కురియడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలు కూడా నిండిపోయాయి. ఎగువ రాష్ట్రాలలో ఆల్మట్టి, నారాయణపూర్ తెలంగాణ లో జూరాల ప్రాజెక్టు లో ప్రస్తుతం నీటి లభ్యత ఎక్కువగా ఉంది. దీంతో నీటికి కిందకు వదలడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరింది. దీంతో  శ్రీశైలం డ్యాం పై ఆధారపడిన రైతులు తమ పంట పొలాల్లో ఇప్పటికే నార్లు వేసుకొని పైర్లు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.