చంద్రబాబునాయుడు పుట్టి పెరిగిన చంద్రగిరి నియోజకవర్గంలో టిడిపి రాజకీయాలు విచిత్రంగా మారిపోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య టిక్కెట్టు కోసం పోటీ పెరిగిపోతోంది. అందుకనే ఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. నేతల మధ్య పోటీతో మధ్యలో కార్యకర్తలు నలిగిపోతున్నారు.

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం ప్రధానంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, పేరం హరిబాబు, ఇంధు శేఖర్ నాయడు మధ్యే పోటీ ఉండబోతోంది. పై ముగ్గురిలో గల్లా కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరారు. మిగిలిన ఇద్దరూ మొదటి నుండి టిడిపిలోనే ఉన్నారు. పోయిన ఎన్నికల వరకూ కాంగ్రెస్ లో ఉన్న గల్లా తనకు చంద్రబాబుతో ఉన్న సన్నిహితం వల్లే టిడిపి నేతలను కాదని టిక్కెట్టు తెచ్చుకోగలిగారు. రాజకీయ నేతే కాకుండా పారిశ్రామిక వేత్త కూడా కావటం గల్లాకు కలిసివచ్చింది. అయితే వైసిపి అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేతిలో వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనటం లేదనే ఆరోపణలున్నాయి.

ఇంకోవైపు పేరం హరిబాబు, ఇందుశేఖర్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉంటున్నారు. ముగ్గురు నేతలూ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే కావటం కూడా టిడిపికి పెద్ద మైనస్ గా మారింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే గల్లాకు వ్యతిరేకంగా మిగిలిన ఇద్దరూ పావులు కదుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ గల్లాకు టిక్కెట్టు రాకుండా అడ్డుకునే విషయంలో ఇద్దరూ వ్యూహాలు పన్నుతున్నారట.

దానికితోడు పార్టీ నేతల్లో కూడా గల్లాకు పెద్దగ సంబంధాలు లేవు. ఆమె ఎవరిని కలుపుకుని పోతున్నది లేదు. అదే సమయంలో పార్టీ నేతలు కూడా గల్లాకు దూరంగానే ఉంటున్నారు. ఉండటానికి గల్లా టిడిపిలోనే ఉన్నా ఆమెను టిడిపి నేతలు ఇంకా కాంగ్రెస్ నేతగానే చూస్తున్నారు. దానికితోడు వచ్చే ఎన్నికల్లో వైసిపిల్లోకి వెళ్ళిపోతారనే ప్రచారం కూడా జరుగుతోంది.

2019లో తనకు టిక్కెట్టు వచ్చే పరిస్ధితి లేకపోతే కొడుకు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ లేకపోతే కూతురు డాక్టర్ రమాదేవిలో ఎవరో ఒకరికి టిక్కెట్టు దక్కించుకోవాలన్నది గల్లా ప్లాన్ గా తెలుస్తోంది. మొత్తానికి చంద్రగిరి పోరుతో వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు తలనొప్పులు తప్పేట్లు లేదు.