జగన్ పై అక్రమాస్తుల అభియోగాలు సత్యదూరం అని సీబీఐ కోర్టులో ఆయన న్యాయవాది తన వాదనలు వినిపించారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ గురువారం కొనసాగింది. 

జగతి పబ్లికేషన్స్‌ వాల్యుయేషన్‌కు సంబంధించిన చార్జిషీటులో సీబీఐ నమోదు చేసిన అభియోగాలు సత్యదూరమని జగన్‌ తరపు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్‌ నేరపూరితమైన కుట్ర చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 

అంతేకాదు చార్జిషీటులో సాక్షుల వాంగ్మూలాలు పొందుపరచిన విధానం పరిశీలిస్తే అది జగన్‌కు వ్యతిరేకంగా లేదన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. 

ఈడీ నమోదు చేసిన కేసులపై శుక్రవారం విచారణ కొనసాగనుంది. ఇక, ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయడానికి సీబీఐ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గడువు కోరారు. దీంతో సీబీఐ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.