తిరుపతి రుయాలో అంబులెన్స్ మాఫియా: ఉన్నతాధికారుల విచారణ, కేసు నమోదుకు రంగం సిద్దం
రుయా ఆసుపత్రి ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణను ప్రారంభించింది. 10 ఏళ్ల బాలుడి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు వేలాది రూపాయాలు డిమాండ్ చేశారు. బయటి నుండి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ పై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు
తిరుపతి: Tirupati రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా అరాచకాలపై జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది. రుయా ఆసుపత్రిలో మంగళవారం నాడు ఉదయం జిల్లా వైద్యాధికారి, ఆసుపత్రి సూపరింటెండ్ లు విచారణ నిర్వహిస్తున్నారు.
Annamaiah జిల్లాలోని Chitvel కు చెందిన ఓ వ్యక్తి తన పదేళ్ల కొడుకుకు కిడ్నీ సంబంధిత చికిత్స కోసం చేర్పించాడు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పదేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ Dead Body ని తీసుకెళ్లేందుకు Ambulance మాఫియా ఇష్టారీతిలో డబ్బులు డిమాండ్ చేశారు. చనిపోయిన బాలుడి తండ్రి బయటి నుండి మరో అంబులెన్స్ ను తీసుకొచ్చినా కూడా స్థానికంగా ఉన్న అంబులెన్స్ డ్రైవర్లు అనుమతించలేదు. బయటి నుండి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ పై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై విచారణ జరుపుతున్నారు.
Ruia ఆసుపత్రిలోని మార్చురీ వాహనం పాడైందని చెబుతున్నారు. అయితే ఈ వాహనం కూడా కొన్ని నిర్ధిష్ట సమయాల్లోనే నడుపుతారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి గుర్తించారు. మరో వైపు ఈ ఆసుపత్రిలోని మార్చురీ వాహనం అవసరమైన వారికి ఇవ్వడానికి మార్గదర్శకాలను రూపొందించనున్నారు. అంబులెన్స్ లకు కూడా ఫీజును కూడా నిర్ధారించే అవకాశం ఉంది.
రుయా ఆసుపత్రికి బయటి నుండి అంబులెన్స్ ను రాకుండా అడ్డుకున్న విషయమై చర్యలు తీసుకోనున్నారు. బయటి నుండి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్, యజమాని నుండి పోలీసులు ఫిర్యాదు తీసుకొంటారు.ఈ ఫిర్యాదు ఆధారంగా రుయా ఆసుపత్రిలోని అంబులెన్స్ మాఫియాపై కేసులు నమోదు చేయనున్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను అధికార యంత్రాంగం చర్యలు తీసుకోనుంది.
ఏడాదిన్నర క్రితం కూడా ఇదే తరహా ఘటనలు రుయా ఆసుపత్రిలో చోటు చేసుకొంది. ఆ సమయంలో కూడా పోలీసులు కేసులు నమోదు చేయడంతో కొంతకాలం పాటు ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా ఆగడాలు నిలిచిపోయాయని పోలీసులు చెబుతున్నారు. అయితే సోమవారం నాడు జరిగిన ఘటనతో జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకొన్నారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ, జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.