సురక్షిత సెక్స్ విషయంపై దేశంలో అవగాహన పెరుగుతున్నట్లే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్ మహమ్మారి గురించి కొత్తగా చెప్పేదేముంది. ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది ఎయిడ్స్ బారిన పడి విలవైన జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఎయిడ్స్ బారిన పడకూడదంటే సురక్షితమైన సెక్సే మార్గమని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వాలే కాకుండా వేలాది స్వచ్చంధ సంస్దలు కూడా ఎయిడ్స్ కు వ్యతిరేకంగా, సురక్షిత సెక్స్ పై భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

ఇక, ప్రస్తుత విషయానికి వస్తే, మన దేశంలో ఆన్ లైన్లో ఉచితంగా ఇవ్వటం మొదలుపెట్టాక 69 రోజుల్లో 10 లక్షల కండోములు సరఫరా అయ్యాయట. రెండు నెలల్లో 10 లక్షల కండోములంటే మాటలా? మామూలుగా మందుల షాపులకు వెళ్ళి కండోములు అడగాలి. అయితే, చాలామంది షాపులకు వెళ్ళి కండోములు అడగాలంటే ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులను గమనించిన స్వచ్చంధ సంస్ధ ‘ఎయిడ్స్ హెల్త్ కేర్ ఫౌండేషన్’ ఆన్ లైన్లో పూర్తిగా ఉచితంగా కండోముల సరఫరాను మొదలుపెట్టింది.

ఎవరైనా సరే తమకు కావాల్సిన కండోములను ఆన్ లైన్లో ఆర్డర్ చేయవచ్చు. ఆర్డర్లో తాము ఇచ్చిన అడ్రస్ కు కండోములు వచ్చేస్తాయి. ఎప్పుడైతే స్వచ్ఛంధ సంస్ధ ఉచితపంపిణీ మొదలుపెట్టిందో చాలామంది ఆన్ లైన్లో కండోములు తెప్పించుకునే పద్దతిపై బాగా ఆసక్తి చూపుతున్నారు. దాని ఫలితమే రెండు నెలల్లో 10 లక్షల కండోముల వాడకం.

వ్యక్తిగతంగా కండోములు కావాలంటూ 4.41 లక్షల మంది, ఎన్జీవోల ద్వారా 5.14 లక్షల కండోములు సరఫరా అయ్యాయి. సంస్ధ లెక్కల ప్రకారం ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువుంది. హిందుస్దాన్ లేటెక్స్ లిమిటెడ్ ఉచిత కండోములను తయారు చేస్తోంది. పై రెండు రాష్ట్రాల్లోనే ఎందుకు ఎక్కువగా డిమాండ్ ఉందన్న విషయమై సంస్ధ అధ్యయనం చేస్తున్నట్లు సంస్ధ డైరెక్టర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ నెలాఖరుకు 10 లక్షల కండోముల సరఫరా అవుతుందని సంస్ధ అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జనవరి కల్లా 20 లక్షల కండోములను సిద్దం చేస్తారట.