అధికారం అవసరం లేదంటూనే మరోవైపే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. పవన్ మాటలు పరస్పర విరుద్దంగా లేవా? అధికారంపై ఆశక్తి లేని వ్యక్తి మరి ఎన్నికల్లో పోటీకి ఎందుకు దిగుతున్నట్లు?

వచ్చే ఎన్నికల్లో గట్టెక్కేందుకు చంద్రబాబునాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఆయుధంగా వాడుకునేట్లే కనబడుతోంది. పోయిన ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఇతరుల సాయం తీసుకున్నట్లుగానే వచ్చే ఎన్నికలకు కూడా చంద్రబాబు ఇప్పటి నుండే సిద్ధమవుతున్నట్లే ఉన్నారు. చేనేత గర్జనలో పవన్ మాటలు విన్న తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబు-పవన్ ఒక్కటేనంటూ సోషల్ మీడియాలో ఎప్పటి నుండో జరుగుతున్న ప్రచారానికి పవన్ మాటలు బలానిస్తున్నాయి.

చేనేత గర్జనలో మాట్లాడుతూ, అధికారంలోకి రావాలని తనకు లేదన్నారు. అధికారం కోసం పార్టీ పెట్టలేదని చెప్పారు. అధికారం కోసం కాకపోతే ఎవరైనా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? పార్టీ ఎందుకు పెడతారు? చిరంజీవి పార్టీని ఎందుకు పెట్టారో పవన్కు తెలీదా? ఇపుడు రాజకీయాల్లో ఉన్నవారంతా ఎందుకున్నారు. ఒకవైపు అధికారం అవసరం లేదంటూనే మరోవైపే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. పవన్ మాటలు పరస్పర విరుద్దంగా లేవా? అధికారంపై ఆశక్తి లేని వ్యక్తి మరి ఎన్నికల్లో పోటీకి ఎందుకు దిగుతున్నట్లు?

ఇవన్నీ చూస్తుంటే మరెవరి ప్రయోజనాల కోసమో పవన్ పనిచేస్తున్నట్లు జనాలు అనుమానించటంలో తప్పేముంది? ఎవరి ప్రయోజనాలై ఉంటాయి. మాట వరసకే అనుకుందాం. అధికారంలో ఉన్న పార్టీపైనే కదా ప్రజల్లో వ్యతిరేకతుండేది. అంటే, వ్యతిరేక ఓట్లంతా ప్రతిపక్షాల్లో ఏ పార్టీ గట్టిగా ఉందో ఆ పార్టీకే పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికైతే వైసీపీ గట్టిగా కనిపిస్తోంది. అంటే టిడిపి వ్యతిరేక ఓట్లన్నీ వైసీపీకే పడతాయి.

మరి, గంపగుత్తగా వ్యతిరేక ఓట్లన్నీ వైసీపీకే పడకుండా అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ఇంకో పార్టీని టిడిపియే రంగంలోకి దింపాలి. అపుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ వైసీపీకే పడకుండా రంగంలోకి దిగిన రెండో పార్టీకి కూడా పడతాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. టిడిపికి పడే ఓట్లు ఎలాగూ టిడిపికే పడతాయి. కాబట్టి తక్కువ మార్జిన్తోనైనా సరే మళ్ళీ అధికారంలోకి రావచ్చన్నది చంద్రబాబు ఆలోచన. పవన్ మాటలకు, చంద్రబాబు ఆలోచనగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సరిపోతోంది కదా? ఎవరి ఆలోచన ఏమిటో అర్ధం చేసుకోలేనంత అమాయకులా జనాలు? ఎప్పుడు ఎవరికి ఎలా వాతలు పెట్టాలో జనాలకు బాగా తెలుసు. కాబట్టి ‘డోన్ట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఓటర్’.