వైసీపీ నేతలకు మాజీ ఎంపీ, ప్రముఖ కాపు నేత హరిరామ జోగయ్య లేఖ రాశారు. ‘‘ఏపీలో ఎన్నికల తర్వాత మీ నాయకుడు ఇంటికా?.. జైలుకా? తేల్చుకోవాలి’’ అని వైసీపీ నేతలను హరిరామ జోగయ్య ప్రశ్నించారు. 

వైసీపీ నేతలకు మాజీ ఎంపీ, ప్రముఖ కాపు నేత హరిరామ జోగయ్య లేఖ రాశారు. ‘‘ఏపీలో ఎన్నికల తర్వాత మీ నాయకుడు ఇంటికా?.. జైలుకా? తేల్చుకోవాలి’’ అని వైసీపీ నేతలను హరిరామ జోగయ్య ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వైసీపీ నేతలు పనిగట్టుకుని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ కావాలా?.. పవన్ కావాలా? అని అడిగినప్పుడే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని అన్నారు. జగన్ పోవాలి.. పవన్ రావాలని ప్రజలే చెప్పారని చెప్పుకొచ్చారు. వైసీపీ విమర్శలకు అదే సమాధానం అని లేఖలో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర రెండో దశను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏలూరులో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ తన వాలంటీర్ వ్యవస్థ పేరుతో మద్యం అమ్మకాల ఆదాయంతో రూ.30 వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేస్తారని విమర్శించారు. వైసీపీ అధికారం చేపట్టిన నాలుగేళ్ల పాలనలో దాదాపు 29 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు. వారిలో 14 వేల మంది ఇళ్లకు చేరారు, మిగిలిన 15 వేల మంది మహిళల ఆచూకీ ఎక్కడ? అని ప్రశ్నించారు. 

వైసీపీ పాలనలో వాలంటీర్లు.. గ్రామంలో ఎంత మంది ఉన్నారు? మహిళలు ఎందరు? వితంతువులు ఎంత మంది ఉన్నారు? అనే వివరాలను ఆరాతీసి ఒంటరి మహిళకు సంబంధించిన సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ మానవ అక్రమ రవాణా జరుగుతోందని న్యూఢిల్లీలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు తనతో చెప్పారని అన్నారు. ఇందులో వైసీపీ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పి.. ఈ విషయాన్ని ఏపీలో ప్రజలకు చెప్పమని అన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలు, బాలికలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రమాదంలో ఉన్నారని అన్నారు. 

రాష్ట్రంలో నిషేధం విధిస్తానని జగన్ ఇచ్చిన హామీ ఏమైందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.1.27 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని.. అయితే రూ.97 వేల కోట్ల ఆదాయం మాత్రమే ప్రభుత్వం చూపుతోందన్నారు. మిగిలిన రూ.30 వేల కోట్లు జేబులో వేసుకున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆ డబ్బునే ఓట్ల కొనుగోళ్లకు వినియోగిస్తారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.

అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రులు, వైసీపీ నేతలు, వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు పలుచోట్ల పవన్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ మహిళా కమిషన్ ఆయనకు నోటీసు జారీచేసింది.