అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విద్యుత్ కోతలు మొదలయ్యాయని వైసీపీ పాలనపై  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు.  

గురువారం నాడు అమరావతిలో పార్టీ సీనియర్లతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.  రాష్ట్రంలో  విత్తనాల కొరతకు తమ పాలనే కారణమని జగన్ సర్కార్ ఆరోపణలను చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

టీడీపీ పాలనలో విద్యుత్ కోతలు లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  కానీ, జగన్ పాలన చేపట్టిన వెంటనే విద్యుత్ కోతలు ప్రారంభమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఐదేళ్ల తమ పాలనలో  ఎరువులు, విత్తనాల కొరత లేకుండా  చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ, విత్తనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.