కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం కోసం ప్రభుత్వ వైన్ షాప్ వద్దకు వెళ్లిన ఓ నిరుపేద కూలీ నిర్వహకుల నిర్లక్ష్యానికి బలయ్యాడు. ఈ విషాద సంఘటన వెల్దుర్తి పట్టణ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారి పక్కనే వున్న ప్రభుత్వ వైన్ షాప్ వద్ద చోటుచేసుకుంది. 

 ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వెల్దుర్తి పట్టణానికి చెందిన హుసేన్ బాషా గత ఎనిమిది సంవత్సరాలుగా హమాలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ మాదిరిగానే గురువారం కూడా పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో హైవే పక్కనే ఉన్నటువంటి మద్యం దుకాణానికి చేరుకొని మద్యం కొనుగోలు చేశాడు. 

read more   కారు బోల్తా.. ముగ్గురు మృతి

అయితే దుకాణం నుండి బయటకు వస్తుండగా కరెంట్ స్తంభం నుండి మద్యం దుకాణంకు కరెంట్ సప్లై కొరకు తీసుకున్న తీగ గొంతుకు తగలడంతో హుసేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. 

మృతుడి భార్య షేక్ బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హుస్సేన్ కుటుంబాన్ని ఆదుకోవాలని... రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. హుసేన్  మృతిచెందడంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని... వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.