టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కి జీవీఎంసీ అధికారులు షాకిచ్చారు. ఆయన భవాన్ని అధికారులు కూల్చివేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... విశాఖ నగరంలో ద్వారకానగర్ మొయిన్ రోడ్డులో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కి చెందిన బహుళ అంతస్థుల భవనం నిర్మించుకున్నారు. అయితే సరైన అనుమతులు లేకుండా డ్రైన్ ఆక్రమించి భవనం నిర్మించారని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 అంతేకాదు.. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు శనివారం ఉదయమే ఈ కూల్చివేత కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కూల్చివేతతో ద్వారకానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ద్వారకానగర్‌లో భారీగా పోలీసుల మోహరించారు. 

కాగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై దృష్టిసారించిన సర్కార్.. కూల్చివేత షురూ చేసింది. ఇప్పటికే విశాఖపట్నంతో పాటు పలు జిల్లాల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్న విషయం విదితమే.