కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నం జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు డిమాండ్ చేశారు. అలాగే విజయవాడ ఎయిర్‌పోర్టుకు కూడా వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరారు.
కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నం జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు డిమాండ్ చేశారు. అలాగే విజయవాడ ఎయిర్‌పోర్టుకు కూడా వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని జీవీఎల్ ప్రస్తావించారు. రాజ్యసభలో ఈ రోజు జీవీఎల్ మాట్లాడారు. తెలుగులోనే మాట్లాడిన జీవీఎల్.. వంగవీటి మోహన రంగా గొప్ప నాయకుడని కొనియాడారు.
‘‘వంగవీటి మోహన రంగా గురించి తెలియని తెలుగువారు ఉండరు. పేదలకు, బడుగు, బలహీనవర్గాలకు ఆరాధ్య దైవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొలుస్తారు. అత్యంత పెద్ద సామాజికవర్గమైన కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి మోహన రంగా ఒక్కేసారే ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఒక గొప్ప ప్రజా నాయకుడిగా పేరుపొందారు. 1986 డిసెంబర్ నెలలో వంగవీటి మోహన రంగా కొందరు ద్రోహులు హత్య చేశారు. రాజకీయ శక్తిగా ఎదుగుతున్న తరుణంలో మోహన రంగాను హత్య చేయడం ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మోహన రంగా చనిపోయి 36 ఏళ్లు గడిచిపోయిన అభిమానులు, రాష్ట్ర ప్రజలు ఆయనను తలుచుకుంటున్నారు.
రాష్ట్రంలోని ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టాలన్న ప్రతిపాదన ప్రజల్లో ఉంది. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. రాష్ట్రంలో ఇతర నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టారు కానీ వంగవీటి రంగా పేరు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకో మనస్సు అంగీకరించలేదు. మోహన రంగా పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా కృష్ణా లేదా మచిలీపట్నం జిల్లాలో ఏదో ఒకదానికి ఆయన పేరు పెట్టాలని సభా ముఖంగా కోరుతున్నాను. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు కూడా వంగవీటి మోహనరంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరుతున్నాను. మోహన రంగా విజయవాడ నుంచి ప్రజా నాయకుడిగా దేశ వ్యాప్తంగా పేరు పొందారు’’ అని జీవీఎల్ అన్నారు.
