న్యూఢిల్లీ: ఉన్న సీఎం పదవి ఊడుతుందని, ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వ్యాఖ్యానిచారు. 

కేంద్రంలో చక్రం తిప్పుతానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఆయన అన్నారు.    చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఆయన శుక్రవారం తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. చంద్రబాబును ప్రధానిని చేస్తామని ఏ ఒక్క నాయకుడు కూడా ప్రతిపాదించలేదని అన్నారు. 

తుమ్మితే ఊడిపోయే పదవి అని అప్పట్లో ఆయనే ప్రధాని పదవికి దూరంగా ఉండి త్యాగం చేసినట్టు ఫోజులు కొడుతున్నారని జీవిఎల్ ఆరోపించారు. చంద్రబాబు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ​ప్రభుత్వ నిధులతో ధర్మపోరాట సభలు పెట్టడం పట్ల జీవీఎల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర నిధులతో పార్టీ సభలు పెడితే చూస్తూ సహించబోమని హెచ్చరించారు. తిరుమలను రాజకీయ వ్యవస్థగా మార్చాలని చూస్తున్నారని అన్నారు. అర్చకులను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. అర్చకులను తొలగించినందుకు చంద్రబాబు చెంపలేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తిరుమల శ్రీవారి ఆభరణాల మాయంపై విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఏమయ్యాయో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.