గుంటూరు: రైతులకు సంకెళ్లు వేసిన తీసుకెళ్లిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో పోలీసు శాఖ దిద్దుబాటు చర్యలను తీసుకొంది.

రైతులను సంకెళ్లు వేసి తీసుకెళ్లిన ఆరుగురు ఎస్కార్ట్  హెడ్ కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. ఆర్ఎస్ఐ, ఆర్ఐలకు ఎస్పీ విశాల్ గున్నీ చార్జి మెమోలు జారీ చేశారు.

అమరావతి పరిధిలోని పెనుమాకకు చెందిన కె. అమర్ బాబు, నంబూరు రామారావు, ఈపూరి సందీప్, కృష్ణాయపాలెనికి చెందిన ఈపూరి రవికాంత్, శొంఠి నరేష్, దానబోయిన బాజీ, ఈపూరి కిషోర్ లను పోలీసులు ఈ నెల 24వ తేదీన సంతకాలు పెట్టించి అరెస్ట్ చేశారు.

నవంబర్ 7వ తేదీ వరకు  వీరికి కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ ఖైదీలతో కలిపి చేతులకు బేడీలు వేసి బస్సులో రైతులను గుంటూరు జైలుకు తరలించారు. గుంటూరు వచ్చాక బస్సు దించి బేడీలు వేసి లోపలకు పంపించారు. 

రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడంపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. పెద్ద పెద్ద నేరాలు చేసిన వారిని జైలుకు పంపించినట్టుగా అమరావతికి చెందిన రైతులను బేడీలు వేసి జైలుకు తరలించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.