తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన విద్యార్థులపై గుంటూరు పోలీసులు అత్యాచారయత్నం కేసుగా పేర్కొనడం సంచలనంగా మారిన
విషయం తెలిసిందే.  ముట్టడికి యత్నించిన టీఎన్‌ఎస్‌ఎఫ్ కు చెందిన ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో రిమాండ్‌ రిపోర్టులో అత్యాచార యత్నంగా పేర్కొనడంపై వివాదానికి దారితీస్తోంది.  ఇలా టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నేతలపై తాడేపల్లి పోలీసులు అత్యాచారయత్నం కేసు నమోదు చేసినట్లుసామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై గుంటూరు అర్బన్ ఎస్పి అమ్మిరెడ్డి స్పందించారు. 

ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో అత్యాచారయత్నం సంబంధిత సెక్షన్లు ఏమీ లేవన్నారు. అయితే రిమాండ్ రిపోర్ట్ టైప్ చేసే సమయంలో వేరే కేసుకు సంబంధించిన మేటర్
పొరపాటున ఈ కేస్ కు అటాచ్ అయినట్లు ఎస్పి వివరించారు. సెక్షన్స్ లో ఎలాంటి తప్పిదం లేదని... కేవలం జరిగిన ఘటనపైనే సెక్షన్లు నమోదు చేసినట్లు అమ్మి రెడ్డి తెలిపారు. టైప్ చేసే సమయంలో కేవలం ఒక సెంటెన్స్ మాత్రమే అదనంగా ఉన్నట్లు దీనివల్ల అపార్థం తలెత్తిందని ఎస్పీ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చుకున్నారు.

 విద్యార్థుల అరెస్ట్ కు సంబంధించిన రిమాండ్‌ రిపోర్టులో అత్యాచారయత్నంగా పేర్కొనడంపై మంగళగిరి కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. సీఎం ఇంటిని
ముట్టడించడం అత్యాచారయత్నం కేసు ఎలా అవుతుందంటూ పోలీసులన నిలదీయగా... జరిగిన తప్పును గుర్తించి పోలీసులు న్యాయమూర్తికి వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. రిమాండ్‌ రిపోర్టులో మార్పులు చేసి సంబంధిత సెక్షన్లను పేర్కొంటూ మళ్లీ న్యాయమూర్తికి సమర్పించారు.