తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. అలాగే లోక్‌సభలో పార్టీ నేతగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాజ్యసభలో నేతగా సుజనా చౌదరి వ్యవహరించనున్నారు.

బుధవారం అమరావతిలో టీడీఎల్పీ సమావేశం సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మరోవైపు జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే అంశంపై టీడీఎల్పీలో చర్చ జరిగింది.

జగన్ ఆహ్వానాన్ని చంద్రబాబు మన్నించినా, పార్టీ నేతలు మాత్రం వారించారు.  రాజ్‌భవన్ వంటి వేదికల వద్ద ప్రమాణ స్వీకారం చేస్తే వెళ్లొచ్చని, బహింరంగంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందున వెళ్లడం కరెక్ట్ కాదని నేతలు బాబుకు తెలిపినట్లుగా తెలుస్తోంది.

పార్టీ నేతల తరపున ఒక బృందాన్ని పంపాలని మెజార్టీ నేతలు అధినేతకు సూచించారు. ఈ నేపథ్యంలో గురువారం ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడిన బృందాన్ని చంద్రబాబు ఇందిరా గాంధీ స్టేడియంకు పంపనున్నారు. బృందంలో పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు ఉన్నారు.