గుంటూరు: మాజీ మంత్రి, ఏపీ బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని గుంటూరు మేయర్ మేయర్ మనోహర్ నాయుడు అన్నారు. దేవాలయాల్లో కోవిడ్ సెంటర్లు పెట్టారని కన్నా చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని కన్నా చూస్తున్నారని ఆయన అన్నారు.  

దేవాలయాల్లో కోవిడ్ సెంటర్లు పెట్టారని కన్నా ట్విట్టర్ లో పెట్టారని ఆయన గుర్తు చేశారు. కన్నా గతంలో ఏ పార్టీలో ఉన్నారో ఏ పార్టీలోకి రాబోయారో ఏ సమయంలో ఆగిపోయారో తెలుసునని ఆయన అన్నారు. పార్టీ కన్నాను అర్థరాత్రి ఎందుకు తొలగించారో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. 

కరోనా మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలేసి ఇస్తోందని ఆయన గుర్తు చేశారు. కన్నాకు మైండ్ పోయిందని తాను అనుకుంటున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. 

గతంలో చంద్రభాబు ప్రభుత్వ హయాంలో 40 గుడులపై దాడులు జరిగితే కన్నా మాట్లాడలేదని ఆయన అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాట్లాడే అర్హత కన్నాకు లేదని ఆయన అన్నారు. తిరుపతి ఎన్నికల్లో మతాన్ని అడ్డు పెట్టుకున్నా కూడా డిపాజిట్లు దక్కలేదని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మనోహర్ నాయుడు వ్యాఖ్యానించారు.