ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపిన కసాయి తనయుడు

guntur man murders parents for property
Highlights

గుంటూరు జిల్లాలో దారుణం...

అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకే ఆ తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. కన్నవారని, అందులో వృద్దులని కూడా చూడకుండా ఓ కసాయి తనయుడు తల్లిదండ్రులను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనకు సంబంధిచిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని మోర్జంపాడు గ్రామానికి చెందిన దుగ్గు పుల్లారెడ్డి (65) పూర్ణమ్మ (60) దంపతులకు నరసింహారెడ్డి, లక్ష్మి అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరికి పెళ్లిలయ్యాయి. అయితే ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తూ నరసింహారెడ్డి ప్రకాశం జిల్లాలోని రెడ్డి పాలెంలో నివాసముంటున్నాడు.

అయితే  నర్సింహరెడ్డి మద్యానికి బానిసై బాగా అప్పులు చేశాడు. దీంతో ఫుల్లుగా మద్యం తాగి వచ్చి అప్పులు తీర్చడానికి డబ్బులివ్వాలంటూ తల్లిదండ్రులను వేధించేవాడు. తరచూ వారితో గొడవకు దిగేవాడు.

బంధువుల ఇంట్లో పెండ్లి ఉండటంతో నర్సింహారెడ్డి స్వగ్రామానికి వచ్చాడు. అక్కడి స్నేహితులతో కలిసి ఫుల్లుగా తాగి తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అక్కడ తండ్రితో మరోసారి డబ్బుల గురించి గొడవకు దిగాడు. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన నర్సింహారెడ్డి కుర్చీలో కూర్చున్న తండ్రి పుల్లారెడ్డి తలపై ఇనుప రాడ్డుతో కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత అదే ఆవేశంలో వంట గదిలోకి వెళ్ళి తల్లి పూర్ణమ్మను కూడా రాడ్డుతో కొట్టి చంపేసి అక్కడినుండి పరారయ్యాడు.
 
ఈ హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
 

loader