ఓ వివాహితుడు మాయమాటలతో బాలికను మభ్యపెట్టి, పెళ్లి చేసుకుని, లైంగిక దాడి చేసిన ఘటనపై కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆదివారం కేసు నమోదైంది. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం వేమూరులో ఈ దారణం జరిగింది. 

పోలీసుల కథనం మేరకు మండలంలోని దోనేపూడి శివారు గ్రామానికి చెందిన బాలిక భట్టిప్రోలులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లల తండ్రైన 35 ఏళ్ల కూచిపూడి శ్రీను అనే వ్యక్తి... కొన్నేళ్లుగా ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆకట్టుకున్నాడు. 

శ్రీనుతో తన కుమార్తె మాట్లాడటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను మందలించారు. కొంతకాలంగా బాలికతో శ్రీను చాటుగా ఫోన్లో మాట్లాడుతున్నాడు. రెండేళ్ల క్రితం అతని భార్య ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.

బాలికలకు మరింత దగ్గరయ్యాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇంటి నుంచి వెళ్లి పోవడానికి సిద్ధంగా ఉండాలని బాలికకు చెప్పి ఈ నెల12 తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై వచ్చి ఆమెను తీసుకుని దోనేపూడి లోని తన బంధువుల ఇంటికి, అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లాడు. ముందుగానే అద్దెకు తీసుకున్న గదిలో మూడు రోజులు బాలికతో ఉన్న శ్రీను లైంగిక దాడి చేయబోగా ఆమె ప్రతిఘటించింది.

అనంతరం స్థానికంగా ఉన్న ఓ గుడిలో బాలిక మెడలో తాళి కట్టాడు. ఇక తాము భార్యభర్తలమని నమ్మించాడు. ఆ తరువత ఆమె మీద లైంగిక దాడి చేశాడు. ఆదివారం తెల్లవారుజామున కారు కిరాయికి మాట్లాడి, బాలికను ఒంటరిగా ఇంటికి పంపించాడు.

ఆ తర్వాత పూర్తి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికతో పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. శ్రీను మీద కిడ్నాప్, లైంగిక దాడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ ఉజ్వల్ కుమార్ తెలిపారు.