ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన గుడివాడ కెసినో వ్యవహారం ఇప్పుడు దేశ రాజధాని న్యూడిల్లీకి చేరింది. టిడిపి ఎంపీలో ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేసారు. 

న్యూఢిల్లీ: సంక్రాంతి పండగ సందర్భంగా మంత్రి కొడాలి నాని ఇలాకా గుడివాడలో కెసినో నిర్వహించారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నిజనిర్దారణ కమిటీని నియమించి నిజానిజాలు తేల్చే ప్రయత్నం చేసింది. అధికార వైసిపి నాయకులు, మంత్రి కొడాలి నాని మాత్రం గుడివాడలో ఎలాంటి కెసినో జరగలేదని టిడిపి ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసారు. ఇలా గుడివాడ కెసినో వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. 

అయితే ఈ కెసినో వ్యవహారాన్ని టిడిపి సీరియస్ గా తీసుకుంది. కెసినో నిర్వహణతో వందల కోట్లు చేతులు మారినట్లు ఆరోపిస్తున్న టిడిపి తాజాగా ఈడీకి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్)కి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల సందర్భంగా న్యూడిల్లీలోనే వున్న టిడిపి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ తో పాటు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈడీ (Enforcement Directorate) అధికారులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గుడివాడ కెసినో వ్యవహారంపై, నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసారు.

ఇక ఇప్పటికే టిడిపి నిజనిర్దారణ కమిటీ నాయకులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ (biswabhushan harichandan)ను కలిసి గుడివాడ క్యాసినో వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని కోరిన విషయం తెలిసిందే. అలాగే ఈ క్యాసినో వ్యవహారం గురించి, దీనివల్ల తెలుగు సంస్కృతికి కలిగే అనర్దాలను వివరిస్తూ వెంటనే దీని నిర్వహణలో పాలుపంచుకున్న మంత్రి కొడాలని నానిపై చర్యలు తీసుకోవాలంటూ టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కూడా గవర్నర్ కు లేఖ రాసారు. వెంటనే మంత్రిమండలి నుండి నానిని తప్పించాలని గవర్నర్ ను చంద్రబాబు కోరారు.

క్యాసినో వంటి విష సంస్కృతిపై పోరాటం కంటిన్యూ చెయ్యాలని టిడిపి స్ట్రాటజీ కమిటీ ఇటీవల జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. వందల కోట్లు చేతులు మారిన ఈ వ్యవహారంలో వివిధ జాతీయ ఏజన్సీలకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చెయ్యాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈడీకి ఫిర్యాదు చేసారు. 

గుడివాడలో క్యాసినో నిర్వహణ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు టీడీపీ నేతల నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ పర్యటన వివాదాస్పదమయ్యింది. క్యాసినో నిర్వహించిన కే కన్వెన్షన్ సెంటర్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు మోహరించారు. టీడీపీ కార్యాలయం నుండి కె కన్వెన్షన్ సెంటర్ వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలోని Gudivada లోని నెహ్రు చౌక్ వద్ద TDP నేతలను పోలీసులు శుక్రవారం నాడు అడ్డుకొన్నారు. గుడివాడలో క్యాసినో సెంటర్ విషయమై నిజనిర్ధారణ కమిటీని పోలీసులు నిలిపివేశారు. 

ఈ సందర్భంగా టీడీపీ, YCP శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయంపై రాళ్ల దాడికి దిగారు. ఇలా గుడివాడ క్యాసినో వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణానికి కారణమయ్యింది. 

ఇక గుడివాడ (gudivada) పర్యటనకు సిద్దమైన ఏపీ బీజేపీ (bjp) అధ్యక్షుడు సోము వీర్రాజును (somu verraju) పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారు దిగి బీజేపీ నేతలు నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే. బీజేపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీ కార్యక్రమానికి వెళ్తుండగా అడ్డుకోవడం ఏంటని సోము వీర్రాజు పోలీసులపై మండిపడ్డారు. ఇలా టిడిపి, బిజెపి నాయకులు గుడివాడకు వెళ్లకుండా పోలీసులు, వైసిపి శ్రేణులు అడ్డుకున్నారు.