10 రోజుల వ్యవధిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. వరుస ప్రయోగాలతో జోరుమీదున్న ఇస్రో దీనిని కూడా ఒక సవాల్‌గా తీసుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ జీఎస్ఎల్‌వీ-ఎఫ్11 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.

మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు నింగిలోకి ప్రయోగిస్తారు. దీని ద్వారా 2,250 కిలోల బరువున్న జీశాట్-7ఏ ఉప్రగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు.

దీని ద్వారా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సమాచార వ్యవస్థకు సేవలందిస్తారు. 2013లో ప్రయోగించిన జీశాట్-7 గడువు ముగియడంతో దాని స్థానంలో జీశాట్-7ఎ ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి పంపుతోంది. ఈ ఉపగ్రహం ఎనిమిది సంవత్సరాల పాటు సేవలు అందించనుంది.