పెళ్లి జరిగి పట్టుమని పది నిమిషాలు గడవక ముందే పెళ్లి కుమారుడు అదృశ్యమయ్యాడు. అత్తింటివాళ్లు బంగారం పెట్టలేదని అలిగి ఆ వరుడు కనిపించకుండా వెళ్లిపోవడం గమనార్హం. ఈ సంఘటన  కదిరి మండలం ముత్యాలచెరువు పంచాయతీ పరిధిలోని పాలబావి ఆలయం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకెళితే... తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లికి చెందిన చిన్న అనే యువకుడికి కదిరి పట్టణం చైర్మన్‌ వీధిలో నివాసం ఉండే తన అక్క కూతురితో వివాహం కుదిరింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం ఇరువైపులా బంధువులు సాసవల చిన్నమ్మ ఆలయం వద్ద వారికి వివాహం జరిపించారు. అయితే పెళ్లికి 3 తులాల బంగారు పెడతామని వధువు తరపువారు చెప్పి మాటతప్పారని వరుడి బంధువులు చెబుతున్నారు.

పేదరికం కారణంగా డబ్బు సర్దుబాటు కాకపోవడంతో పెళ్లిలో బంగారు పెట్టలేకపోయారు వధువు తరపువారు చెబుతున్నారు. తనకు బంగారు పెట్టకుండా మోసం చేశారంటూ పెళ్లికుమారుడు చిన్న తాళి కట్టి పదినిమిషాల్లోనే అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. కొద్ది సేపటి తరువాత డయల్‌ 100 ఫోన్‌కు తనకు బలవంతంగా పెళ్లి చేశారని ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన రూరల్‌ మండల పోలీసులు అతడు ఉన్న చోటికి వెళ్లి స్టేషన్‌ తీసుకువచ్చారు. అలాగే వధువు తరపువారిని కూడా స్టేషన్‌ పిలించారు. అమ్మాయి మైనర్‌గా  కనిపిస్తోందన్న అనుమానంతో పోలీసులు ఐసీడిఎస్‌ వారికి సమాచారం అందించారు. తాళి కట్టి గంటలు గడవక ముందే బంగారం డిమాండ్‌ చేస్తున్న అలాంటి వ్యక్తితో అమ్మాయి నూరేళ్లు సుఖంగా ఎలా సంసారం చేయగలదో ఒకసారి ఆలోచించాలని సీఐ నిరంజన్‌రెడ్డి వధువు తరపువారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కాగా పెళ్లికూతురికి తల్లిదండ్రులు లేరు. పెళ్లి కుమారుడికి తండ్రి లేడు. ఇరువురి బంధువులు ఈ వివాహం జరిపించారు.