రాజధానా, ప్రత్యేక రాష్ట్రమా.. తేల్చుకోండి: జగన్‌కు గ్రేటర్ రాయలసీమ నేతల లేఖ

గ్రేటర్ రాయలసీమను రాజధానిగా చేయాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు రాయలసీమ నేతలు.

greater rayalaseema leaders letter to ap cm ys jagan for capital

గ్రేటర్ రాయలసీమను రాజధానిగా చేయాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు రాయలసీమ నేతలు. హైదరాబాద్‌లో సమావేశమైన మాజీ మంత్రులు ఎంవీ. మైసూరా రెడ్డి, శైలజానాథ్, మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి.. జగన్‌కు రాసిన లేఖలో సంతకాలు చేశారు.

ఉమ్మడి రాష్ట్రం కోసం కర్నూలు ప్రాంత ప్రజలు ఎప్పుడో రాజధానిని త్యాగం చేశారని, వారి త్యాగాలు వృథా కాకూడదని సూచించారు మైసూరా రెడ్డి. గ్రేటర్ రాయలసీమలో రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read:ఏపీకి మూడు రాజధానులు: జై కొట్టిన విశాఖ తమ్ముళ్లు, బాబుకు తీర్మానం

పరిపాలనా వికేంద్రీకరణను సమర్థిస్తున్నామని.. అదే సమయంలో గ్రేటర్ రాయలసీమకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన కోరారు. హైకోర్టును హైదరాబాద్‌కు తరలిస్తున్నప్పుడు కూడా కొందరు న్యాయవాదులు, ప్రజా సంఘాలు కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు.

ఒకప్పడు తెలుగువారి ఐక్యత కోసం రాజధానిని త్యాగం చేసినందున ఇప్పుడు తమ న్యాయమైన కోరికను నెరవేర్చాలని మైసూరా కోరారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడూ కూడా తమకు రాజధాని కావాలని డిమాండ్ చేయలేదని, అయితే తాము ముందు నుంచే రాజధానిని కోరుతున్న సంగతిని ఆయన గుర్తుచేశారు.

రాజధాని రాయలసీమలో పెట్టని పక్షంలో గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మైసూరా తేల్చి చెప్పారు. ల్యాండ్‌పూలింగ్ విధానాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చంద్రబాబు కంటే ముందే హైదరాబాద్‌లో ఎప్పుడో ప్రవేశపెట్టారని ఆయన వెల్లడించారు.

Also Read:అమరావతి తరలింపును వ్యతిరేకిస్తాం: లెప్ట్

అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మైసూరా ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలోనూ రాయలసీమ మునిగిపోయిందని... నీరు మాత్రం కోస్తాకే వెళ్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
greater rayalaseema leaders letter to ap cm ys jagan for capital

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios