అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరించుకోవాలని అభ్యర్థిని బెదిరించాడనే ఆరోపణపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మచిలీపట్నం పొట్లపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి నాగరాజును కొల్లు రవీంద్ర బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొల్లు రవీంద్ర సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో గత నాలుగు దశాబ్దాల తర్వాత ఎన్నిక జరుగుతోంది. గత నాలుగు దశాబ్దాలుగా సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవుతూ వచ్చింది. ఈసారి అభ్యర్థులు పోటీలో ఉండడంతో పోలింగ్ అనివార్యంగా మారింది. 

నిమ్మాడ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడి స్వగ్రామం. ఆయన సతీమణి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. వైసీపి మద్దతుతో అప్పన్న నామినేషన్ దాఖలు చేశారు. అయితే, అప్పన్నను బెదిరించారనే ఆరోపణపై అచ్చెన్నాయుడి మీద కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడి బెయిల్ మీద సోమవారం జైలు నుంచి విడుదలయ్యారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ రోజు మంగళవారం తొలి విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వైబ్ కాస్టింగ్ ద్వారా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.