తిరుమల తిరుపతి దేవస్థానానికి మహారాష్ట్ర ప్రభుత్వం ముంబాయిలోని బంద్రాలో స్థలం కేటాయించింది. ఆ స్థలంలో టీటీడీ బాలజీ ఆలయాన్ని నిర్మించనుంది. ఈ మేరకు గురువారం మీడియాతో టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి వివరాలు వెల్లడించారు.
మహారాష్ఠ్ర (maharastra) రాజధాని ముంబాయి (mumbai)లో బాలాజీ ఆలయం నిర్మించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ (ttd)కి భూమి కేటాయించింది. గురువారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (y v subbareddy) మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ముంబాయిలోని బంద్రా ప్రాంత్రంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందని, ఆ స్థలంలో టీటీడీ ఆలయం నిర్మిస్తుందని చెప్పారు. ఆలయ నిర్మాణానికి కావాల్సినవన్నీ సమకూర్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంటుందని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే చెప్పారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ విషయంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే (uddhav thackeray)కు, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే (aditya thakre)కు కృతజ్ఞతలని అన్నారు.
వార్షిక బడ్జెట్ ను ఆమోదించిన టీటీడీ పాలక మండలి
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,096.40 కోట్ల ఆదాయ అంచనాతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. వచ్చే 12 నెలల ఆర్థిక ప్రణాళికను బడ్జెట్ సమావేశంలో సమీక్షించిన అనంతరం వార్షిక బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపినట్లు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
హుండీ ఆదాయం ద్వారా రూ.1,000 కోట్లు
తిరుమల తిరుపతి ఆలయ సముదాయాల్లో హుండీ ద్వారా రూ.1,000 కోట్లు వస్తాయని టీటీడీ పాలక మండలి అంచనా వేసింది. జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లపై వచ్చే వడ్డీ ద్వారా దాదాపు రూ.668.5 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని భావించింది. అలాగే ఆలయంలో వీఐపీ టిక్కెట్లు, రోజు వారి టిక్కెట్లు, ప్రత్యేక పూజ టిక్కెట్ల ద్వారా సుమారు రూ. 362 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని టీటీడీ భావించింది. దీంతో పాటు లడ్డూ, ప్రసాదం విక్రయం ద్వారా దాదాపు రూ.365 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేసింది.
