పదోతరగతి బాలికపై టీచర్ అత్యాచారం.. బెదిరించి పలుమార్లు అఘాయిత్యం.. పురుటినొప్పులు రావడంతో...
ఓ ప్రభుత్వోపాధ్యాయుడు దారుణానికి ఒడిగట్టాడు. పదో తరగతి విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది.

సత్యసాయి జిల్లా : విద్యాబుద్ధులు నేర్పి.. విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. కన్నూ మిన్నూ కానని కామంతో విద్యార్థినులపై కన్నేస్తున్నారు. వారి మీద అఘాయిత్యాలకు పాల్పడుతూ గర్భిణులుగా మారుస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వెలుగు చూసింది. ఈ నియోజకవర్గానికి చెందిన ఓ పదహారేళ్ల బాలిక ఏడాది కిందట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుండేది.
ఓ రోజు దాహం వేసి నీళ్లు తాగడానికి స్టాఫ్ గదిలోకి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడే ఉన్నరెడ్డి నాగయ్య అనే టీచర్ ఆ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను తీవ్రంగా బెదిరించాడు. దీంతో బాలిక భయంతో మిన్నకుండిపోయింది. బాలిక మౌనంగా ఉండిపోవడాన్ని అదునుగా తీసుకున్న సదరు కీచక టీచర్.. ఆ బాలిక మీద బెదిరింపులకు పాల్పడుతూ అనేకమార్లు అత్యాచారం చేశాడు.
చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక: ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల పిటిషన్
ఈ క్రమంలో శనివారం బాలిక కడుపునొప్పితో బాధపడింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చారు. ప్రసవం చేసి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. అయితే బాధితురాలికి రక్తం తక్కువగా ఉంది. దీంతో ఆమెను కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించాలని తల్లిదండ్రులకు సూచించారు.
వైద్యుల సూచన మేరకు ఆమెను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తుండగా విషయం పోలీసులకి చేరవేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇంత ఘాతుకానికి కారణమైన ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విషయం తెలియడంతో కదిరి డిఎస్పి శ్రీలత బాధిత బాలికను అనంతపురం ఆసుపత్రిలో పరామర్శించారు. ఆ తరువాత మీడియాకు వివరాలు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం, 376, 506 సెక్షన్ల కింద నిందితుడి మీద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.