Asianet News TeluguAsianet News Telugu

జగన్ మీద కత్తి దాడిపై గోరంట్ల సంక్రాంతి స్పెషల్ కామెంట్

సంక్రాంతి పర్విదినం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గతంలో జగన్ మీద జరిగిన కత్తి దాడిని గుర్తు చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

Gorantla Butchaiah Chowdary comments on attack on YS Jagan
Author
Rajahmundry, First Published Jan 17, 2022, 6:34 PM IST

రాజమండ్రి: సంక్రాంతి పర్విదనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోరుగా కోడిపందేలు జరిగిన విషయం తెలిసిందే. సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించడం ఏపీలో సంప్రదాయంగా వస్తోంది. ఈ పర్వదినాన జరిగిన కోడి పందేలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చురకలు అంటించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ మీద జరిగిన కత్తి దాడిని ప్రస్తావిస్తూ వ్యంగ్య బాణాలు విసిరారు. 

"సంక్రాంతికి కోడి పందెం అనేది ప్రత్యేకత. కానీ కొంత మందికి దానికి కట్టే కత్తి చూస్తే ఆనందం వస్తుంది....! ఆ కత్తి గుచ్చుకుంటే గుచ్చుకున్న కోడి ఓడిపోతుంది.... కానీ కొంత మందికి అది గుచ్చుకుంటే విజయం సాధిస్తారు!. Both are not same!" గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaih Choudary) ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ (YS Jagan) మీద దుండగుడు కోడి కత్తితో దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి టీడీపీ నాయకులు కోడికత్తి అనే పదాన్ని వాడుకలోకి తెచ్చారు. దాన్నే బుచ్చయ్య చౌదరి ఈ విధంగా మలుచుకున్నారు. బుచ్చయ చౌదరి తన ఆ ట్వీట్ ఆదివారంనాడే చేశారు. 

ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, అధికారంలోకి వచ్చారు. 151 ఎమ్మెల్యేలను గెలుచుకుని తిరుగులేని విజయం సాధించారు. అందుకే, కొంత మందికి కోడి కత్తి గుచ్చుకుంటే విజయం సాధిస్తారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 

 

వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోమవారంనాడు కూడా ఓ వ్యాఖ్య చేశారు. ప్రభుత్వం రాజకీయ క్షలకి పాల్పడడం హేయమైన చర్య అని, నీచమైన రాజకీయం సాంస్కృతిక విధానంలో వైసీపీ ప్రభుత్వం వెళ్తుందని ఆయన అన్నారు. అభివృద్ధి చేయాలని ప్రజలు అధికారం ఇస్తే అరాచకాలు చేస్తురన్నాని ఆయన విమర్శించారు. భూమి గుండ్రంగా ఉంటుందనే విషయాన్ని వైసీపీ వాళ్లు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. 

కరోనా సోకిన తమ తమ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, యువనాయకులు నారా లోకేష్ (Nara Lokesh) త్వరగా కోలుకోవాలని కోరుతూ కూడా ఆయన ఓ ట్వీట్ చేశారు. నారా లోకేష్ కు కరోనా వ్యాధి సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. నారా లోకేష్ కు ట్యాగ్ చేస్తూ - కరొనా నుంచి నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని బుచ్చయ్య చౌదరి ఆకాంక్షించారు. కరోనా నుంచి త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios