ఏలూరు జిల్లాలోని ద్వారక తిరుమల మండలం జి కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేశారు.
ఏలూరు జిల్లాలోని ద్వారక తిరుమల మండలం జి కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యేకు గాయాలు అయ్యాయి. జి కొత్తపల్లి వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయని చెబుతున్నారు.అయితే ఈ రోజు ఉదయం వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకట్రావు.. హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జి కొత్తపల్లికి వెళ్లారు. అయితే ఎమ్మెల్యేను ప్రసాద్ వర్గీయులు అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే మద్దతు ఓ వర్గానికి ఉండటం వల్లే హత్య జరిగిందని ఆరోపిస్తూ ప్రసాద్ వర్గీయులు ఎమ్మెల్యేపై దాడికి దిగారు.తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. ఎమ్మెల్యేపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణ నిలిచారు. అతి కష్టం మీద ఎమ్మెల్యేను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు గాయాలు అయ్యాయి. గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
ఇక, ప్రసాద్ వ్యతిరేక వర్గాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని.. ఆ వర్గమే ప్రసాద్‌ను హత్య చేయించిందనే ప్రసాద్ వర్గం నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
