నిజంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు శుభవార్తే ఇది. ఇంతకాలం ఖాతాదారులను ఇబ్బంది పెట్టిన నిబంధనలను బ్యాంకు సడలిస్తోంది.

పొదుపు ఖాతాల్లో ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ పరిమితితో పాటు సంబంధిత జరిమానా చార్జీలను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. ఈ నిబంధన లక్షలాది మంది ఖాతాదారులకు బాగా ఇబ్బందిగా ఉంది.

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఎస్‌బీఐకి 40.2 కోట్ల మంది పొదుపు ఖాతాదారులు ఉన్నారు. ఐదేళ్ల విరామం తర్వాత గత ఏడాది ఏప్రిల్ నుంచి నెలవారీ సగటు నగదు నిల్వ చార్జీలను అమల్లోకి తీసుకొచ్చింది.  మెట్రో నగరాల్లోని ఖాతాల్లో కనీసం రూ.5 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీసం వెయ్యి రూపాయలు నిల్వ ఉంచకపోతే బ్యాంకు జరిమానా విధిస్తోంది. జరిమానా రూపంలోనే బ్యాంకు ఏడాదికి   రూ.1,771 కోట్ల లాభాన్ని సంపాదిస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో ఎస్‌బీఐ నికర లాభాల్లో పొదుపు ఖాతాదారుల విషయంలో జరిమానా మొత్తమే భారీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేశాయి. దాంతో బ్యాంకుపై విమర్శలు మొదలయ్యాయ్.  దాంతో బ్యాంకు యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. పొదుపు ఖాతాల్లో ఉంచాల్సిన నెలవారీ సగటు నగదు నిల్వ పరిమితిని తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

గత ఏడాది అక్టోబర్‌లో ఈ పరిమితిని కొంత మేరకు (మెట్రో నగరాల్లో రూ.3 వేలకు) తగ్గించిన బ్యాంకు తాజాగా మరోసారి సమీక్ష జరుపుతున్నట్లు ఎస్‌బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా ముంబైలో ప్రకటించారు. నెలవారీ సగటు నగదు నిల్వ పరిమితితో పాటు దానిని పాటించని వారిపై విధించే పెనాల్టీ చార్జీలపై విస్తృత సమీక్ష జరుపుతున్నామని, ఈ అంశాలపై తీసుకునే నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు.