Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. ఓటీఎస్ ఛార్జీల‌ సవరణకు ఆమోదం తెలిపిన కేబినేట్

ఓటీఎస్ ఛార్జీల్లో ప‌లు స‌వ‌ర‌ణ‌లు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యానికి ఆంధ్రప్రదేశ్ కేబినేట్ ఆమోద‌ముద్ర వేసింది. దీని ప్ర‌కారం గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సించే ప్ర‌జ‌ల‌కు రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టే వెసులుబాటు క‌ల్పించింది. ఓటీఎస్ ఛార్జీలు కూడా తగ్గించింది. 

Good news for AP people .. Cabinet approves revision of OTS charges
Author
Amaravathi, First Published Jan 22, 2022, 11:46 AM IST

ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో ప్ర‌భుత్వం కీల‌క మార్పులు తీసుకొచ్చింది. ఓటీఎస్ ఛార్జీల్లో ప‌లు స‌వ‌ర‌ణ‌లు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యానికి కేబినేట్ ఆమోద‌ముద్ర వేసింది. దీని ప్ర‌కారం గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సించే ప్ర‌జ‌ల‌కు రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టే వెసులుబాటు క‌ల్పించింది. లోన్ తీసుకుని చెల్లించకున్నా, అలాంటి ఆస్తి చేతులు మారినా ఒకే స్లాబ్ వర్తింపు చేయ‌నుంది.  గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో రూ.15వేలు, నగరపాలక సంస్థల్లో రూ.20 వేలుగా ఓటీఎస్ ఛార్జీలను నిర్ణ‌యించింది. వీటికి ఏపీ కేబినేట్ శుక్ర‌వారం ఆమోదం తెలిపింది. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ ఓటీఎస్ విధానంపై చాలా కాలంగా వివాదం న‌డుస్తోంది. ప్ర‌తిప‌క్ష టీడీపీ ఓటీఎస్ పై చాలా కాలంగా ఆరోప‌ణ‌లు చేస్తోంది. పేద ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేయ‌డానికే ప్ర‌భుత్వం దీనిని తీసుకొచ్చింద‌ని ఆరోపిస్తోంది. అయితే దీనికి మంత్రులు కూడా ఘాటుగానే స‌మాధానం ఇస్తున్నారు. పేద వాళ్లంద‌రికీ ఉచితంగా ఇళ్లు ఇవ్వాల‌నే ఉద్దేశంతోనే ప్ర‌భుత్వం ఈ ఓటీఎస్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింద‌ని చెబుతూ ఇస్తున్నారు. ఓటీఎస్ పై ఏపీలో చాలా కాలంగా చ‌ర్చ జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో నేడు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్ కు బహిరంగ లేఖ రాశారు. ఓటీఎస్ పేరుతో పేదప్రజలపై ఒత్తిడి తేవద్దంటూ సీఎం జగన్‌ను ముద్ర‌గ‌డ ఆ లేఖ‌లో కోరారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని తెలిపారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు ఇప్ప‌టి వ‌ర‌కు బిల్లులు చెల్లించ‌లేద‌ని, అయితే గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు అధికారం ఎక్కడిదని ఆయ‌న ప్రశ్నించారు. 

వైఎస్ ఆర్ సీపీ ఏపీలో అధికారం చేప‌ట్టాక సంపూర్ణ గృహ హక్కు పథకం తీసుకొచ్చింది. దీని కింద గృహ నిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 మధ్య రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం ఈ పథకంతో  పూర్తి యాజమాన్యం హక్కులు కల్పించాల‌ని భావించింది. దీని కోసం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌ పరిధిలో రూ.20 వేలు చొప్పున ఏకకాలంలో ప్రభుత్వానికి చెల్లించాలని పేర్కొంది. దీనిని వన్ టైమ్ సెటిల్‌మెంట్‌గా కూడా వ్యహరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios