Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అరెస్ట్ టిడిపికే లాభం... 151 పైచిలుకు సీట్లతో రికార్డ్ విక్టరీ..: గోనె ప్రకాష్ రావు (వీడియో)

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Gone Prakash Rao reacts on TDP Chief Chandrababu Arrest AKP
Author
First Published Sep 13, 2023, 12:32 PM IST

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఏపీలో రాజకీయ పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు స్పందించారు.చంద్రబాబు అరెస్ట్ తెలుగుదేశం పార్టీకే మేలు చేయనుందని... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ రెడ్డి పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. గత ఎన్నికల రికార్డును బద్దలుకొడుతూ టిడిపి 151కి మించి ఎమ్మెల్యేలను గెలుచుకుంటుందని అన్నారు. 1980 లో ఇందిరాగాంధికి లాభం జరిగినట్లే చంద్రబాబుకు కూడా లాభం జరగనుందని... తిరిగి ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని గోనె ప్రకాష్ రావు పేర్కొన్నారు. 

వైసిపి కీలక నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై గోనె ప్రకాష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సజ్జల ఓ బ్రోకర్, చీటర్, అహంకారి... అలాంటివాడు ఏపీ ప్రభుత్వ శాఖలన్నింటిని తన చేతుల్లో పెట్టుకున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అన్నీ తానే అయిపోయాడని అన్నారు. అలాంటి  సజ్జల స్కిల్ డెవలప్ మెంట్ కేసులోనే కాదు అనేక కేసుల్లో చంద్రబాబు అనుమానితుడు కాబట్టే సిఐడి అరెస్ట్ చేసిందని అనడం విడ్డూరంగా వుందన్నారు. ఇలా మాట్లాడేందుకు సజ్జలకు సిగ్గు, లజ్జ వుండాలని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. 

గతంలో వైఎస్ జగన్ కు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో వున్నాడు కదా... ఆయన అనుమానితుడా కాదా? అని ప్రకాష్ రావు ప్రశ్నించారు. జగన్ జైలుకు ఎందుకు పోయాడో సజ్జల చెప్పాలన్నారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కయి అసూయతో పెట్టారా? అంటూ సజ్జలను నిలదీసారు గోనె ప్రకాష్ రావు. 

వీడియో

దమ్ముంటే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల తనతో చర్చకు రావాలని గోనె ప్రకాష్ రావు సవాల్ విసిరారు. లేదంటే మంత్రులు, ఇతర కీలక నాయకులు ఎవరైనా చర్చకు సిద్దమా? అన్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని... చివరకు ఇడుపులపాయలో చర్చకు కూడా తాను సిద్దమేనని మాజీ ఆర్టిసి ఛైర్మన్ ప్రకాష్ రావు ఛాలెంజ్ విసిరారు. 

Read More  చంద్రబాబు అరెస్ట్ : మా పార్టీ ప్రభుత్వం భూస్థాపితం కావడం ఖాయం.. వైసీపీ ఎంపీ రఘురామ

చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి శ్రేణులు కంగారుపడొద్దని... ఇది ఆశ్చర్యపోయే  ఫలితాలు ఇస్తుందన్నారు. శాడిస్ట్ చర్యలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేసారన్నారు. దీని ఫలితం రాబోయే ఎన్నికల్లో కనిపించనుందని...టిడిపికి 151 పైచిలుకు సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. 

ఇదిలావుంటే గతంలోనూ పలు సందర్భాల్లో ఏపీలో వైసిపి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని గోనె ప్రకాష్ రావు అభిప్రాయపడ్డారు. టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీచేస్తే 151 సీట్లు దాటడం ఖాయమని... ఒంటరిగా పోటీ చేసినా టిడిపికి 100కు పైగానే సీట్లు వస్తాయని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి చిత్తుగా ఓడిపోవడం ఖాయమని గోనె ప్రకాష్ రావు అన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios