చంద్రబాబు అరెస్ట్ : మా పార్టీ ప్రభుత్వం భూస్థాపితం కావడం ఖాయం.. వైసీపీ ఎంపీ రఘురామ
చంద్రబాబు అరెస్టులో తమ పార్టీ ప్రభుత్వం భూస్థాపితం అవుతుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తమ ప్రభుత్వమే నూటికి నూరు శాతం దోషి అని తేల్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫైలు లేకుండానే కేసు నమోదు చేయడం ఏమిటంటే ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తిగా డొల్ల అని.. ఈ కేసు దెబ్బకు తమ పార్టీ గుల్ల అవుతుందని ఎద్దేవా చేశారు.
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ20 సదస్సు జరుగుతుంటే… ఆ సమయంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటూ చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు అరెస్టు నేపథ్యమే ప్రముఖంగా మారి జి20 సదస్సును పట్టించుకున్న వారే లేకుండా పోయారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేయడంతో తమ వైసిపి ప్రభుత్వం భూస్తాపితం కావడం తప్పదన్నారు.
ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ.. మరుసటి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు..!
ఈ విషయంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ చీవాట్లు పెట్టనున్నట్లు సమాచారం ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సమయంలో ఆనాటి ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా ఉన్న అజయ్ కల్లం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డి లను కూడా అరెస్టు చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ ఫైల్ ఉంటే ఈ అరెస్టులు చేయాల్సి వస్తుందని వాటిని మాయం చేశారన్నారు. ఈ కేసులో అసలు కుంభకోణమే జరగలేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి.. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సిట్ పోలీసు అధికారి రఘురామిరెడ్డిల సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఒరిజినల్ ఫైల్స్ మాయం చేశారు.
సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారులు ఈ కేసులో ఇరుక్కుపోతారని ముఖ్యమంత్రి ఇలా చేశారని ఆరోపించారు. గవర్నర్ అనుమతి లేకుండా, నోట్ ఫైల్ కూడా లేకుండా.. 14 యేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ వ్యక్తిపై సిఐడి కేసు నమోదు చేయడం.. ఆ కేసును ఏసీబీ కోర్టు విచారించడం విచిత్రంగా ఉందన్నారు. సిఐడి కోర్టుకు వెడితే తాము అనుకున్నట్టుగా, అనుకూలంగా తీర్పురాదని భావించారా? అని ప్రశ్నించారు.