ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పెను దుమారానికి కారణమైన తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంట పంచాయతీకి తొలి విడతలోనే సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పెను దుమారానికి కారణమైన తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంట పంచాయతీకి తొలి విడతలోనే సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలతో శ్రీనివాస్ ఫ్యామిలీ అభిప్రాయం తీసుకున్నారు ఆర్డీవో.

దీంతో తొలి దశలోనే గొల్లలగుంట సర్పంచ్ ఎన్నిక జరపాలని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు గొల్లలగుంట పంచాయతీ సమస్యాత్మక ప్రాంతంగా గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నెల 9న ఎన్నిక రోజున అదనపు బలగాలు ఏర్పాటు చేస్తామని స్థానిక ఆర్డీవో వెల్లడించారు.

కాగా, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి సబ్బేళ్ల పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న సంగతి తెలిసిందే.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. ముందుగా ప్రత్యర్ది పార్టీకి చెందిన వారు ఆయనని కిడ్నాప్‌ చేశారంటూ స్దానికంగా కలకలం రేగింది. అయితే, ఈ వ్యవహరంపై పుష్పవతి కానీ, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి కానీ.. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. 

గుర్తు తెలియని వ్యక్తులు మత్తిచ్చి కాళ్లు చేతులు కట్టి దూరంగా అడవి ప్రాంతంలో వదిలేశారని సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి ఆమె భర్త శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే, సోమవారం మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్ లో ఉన్న శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత జగ్గంపేట మండలం కాండ్రేగల గ్రామం శివారు పొలంలో ఉరి వేసుకొని చనిపోయాడు.

ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఒక డిఎస్పీ, నలుగురు సభ్యులు ఉంటారు. ఇప్పటికే సిట్ టీం దర్యాప్తు ప్రారంభించింది. పోలీసు నిర్లక్ష్యం, శ్రీనివాస్ రెడ్డి కిడ్నాప్, ఆత్మహత్య పై సిట్ టీం నివేదిక ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.