Asianet News TeluguAsianet News Telugu

ఆచూకీ తెలియని 15 మంది: బోటు వెలికితీతకు ధర్మాడి సత్యం ప్రయత్నం

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్య గోదావరి నదిలో బోటు మునిగిన ప్రాంతంలో ధర్మాడి సత్యం బృందం మూడో రోజు కూడ బోటు వెలికితీతకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Godavari Boat Extraction Works Are Going at Brisk Pace
Author
Devipatnam, First Published Oct 2, 2019, 12:18 PM IST

దేవీపట్నం:  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చులూరు వద్ద 17 రోజుల క్రితం గోదావరిలో మునిగిన బోటును వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రోజున ధర్మాడి సత్యం బృందం బుధవారం నాడు గోదావరి నదిలో బోటు వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 గత నెల 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్య లో బోటు మునిగిపోయింది.మునిగిపోయిన బోటులో ఉన్న 15 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. బోటులోనే వీరి మృతదేహాలు ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు దీంతో బోటును  వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాకినాడకు చెందిన ధర్మాడి సత్యానికి బోటును వెలికితీసేందుకు ఏపీ ప్రభుత్వం గత నెల 28వ తేదీన  రూ. 22 లక్షలకు వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఈ బోటు వెలికితీతలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ రిస్క్ కవరేజీని ఏపీ ప్రభుత్వం కల్పించింది.

రెండు రోజులుగా కచ్చలూరు వద్ద బోటు వెలికితీతకు ప్రయత్నిస్తున్నారు. గత నెల 30వ తేదీన ధర్మాడి సత్యం బృందం గోదావరిలో బోటు మునిగిన ప్రాంతంలో లంగర్ వేశారు.  లంగర్ కు బోటు తగిలిందని సత్యం బృందం భావించింది.

అక్టోబర్ 1వ తేదీన ధర్మాడి సత్యం బృందం రెండు లంగర్లను వేసి బోటును ప్రోక్లెయినర్ సహాయంతో  నది నుండి బయటకు వెలికితీసే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో బోటు  బయటకు రాలేదు. నదిలో వేసిన లంగర్ కు ప్రొక్లెయినర్ కు మధ్య వేసిన ఐరన్ రోప్ తెగింది. అదే సమయంలో భారీగా వర్షం కురవడంతో రెండో రోజున బోటు వెలికితీత పనులను నిలిపివేశారు.

బుధవారం నాడు సత్యం బృందం బోటు వెలికితీత పనులను ప్రారంభించారు. ఇవాళ మూడు లంగర్లను వేసి బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. అయితే లంగర్ కు తగిలింది బోటు అని  ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది.

గోదావరి నదిలో వరద ఉధృతి తగ్గుతుండడంతో  బోటు కొంచెం ముందుకు వెళ్లే అవకాశం ఉందని  ధర్మాడి సత్యం  బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో బోటు మునిగిన ప్రాంతంలోనే రెండు మూడు చోట్ల లంగర్లను ఏర్పాటు చేశారు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios