వెంటపడి వేదించిన ఆకతాయిని ఓ అమ్మాయి దుమ్ము దులిపేసింది. ధైర్యంగా ఆకతాయిని పట్టుకుని కుమ్మేసింది. క్రిందపడేసి చెప్పుతీసుకుని వాయించేసింది. ఇంతకీ ఏమి జరిగిందంటారా? యానాంలో అల్లరికి పాల్పడిన ఓ ఆకతాయికి ఓ యువతి చుక్కలు చూపించింది. ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఇద్దరు యువతులు పనిమీద యానాంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంకు వెళ్ళారు. అదే సమయంలో అక్కడే మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు వారిని అడ్డుకున్నారు. వారిపై చేయ్యేసే ప్రయత్నం చేశాడు. మొదట్లో అతని నుండి పక్కకు తప్పుకుని వెళ్ళిపోదామని అమ్మాయిలు అనుకున్నారు. అయితే, తాగుబోతు వారిని వదల్లేదు. దాంతో సహనం నశించిన ఇద్దరిలో ఓ అమ్మాయి అతడి దుమ్ముదులిపింది. కిందపడేసి ఈడ్చి తన్నింది.

చొక్కాపట్టి క్రిందకు ఈడ్చి కొట్టింది. చెప్పుతీసుకొని వీపు పగులగొట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి స్కూటిపై వెళ్లిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు.