టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి అంటే?
టీడీపీ పెండింగ్ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇందులో గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేసింది. ఆయనను చీపురపల్లి నుంచి కాకుండా భీమిలి నుంచి బరిలో నిలుపనుంది.
పెండింగ్ సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరును కూడా ప్రకటించింది. గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వమై కొంతకాలం సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయనను మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. కానీ, అందుకు గంటా ససేమిరా అన్నారు. ఆ నియోజకవర్గం వేరే జిల్లా అని.. తనకు విశాఖపట్నంలోనే ఏ సీటు ఇచ్చినా సరే అని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. టీడీపీ అధిష్టానం అందుకు సమ్మతించిందని తాజా జాబితా వెల్లడిస్తున్నది. గంటా శ్రీనివాసరావును విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది.
కాగా, బొత్సపై పోటీగా ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును పార్టీ ఖరారు చేసింది. ఆయన నియోజకవర్గం ఎచ్చెర్ల కూటమి సర్దుబాటులో భాగంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. అసెంబ్లీ స్థానాలతోపాటు నాలుగు పార్లమెంటు స్థానాలను కూడా టీడీపీ ఖరారు చేసింది.
విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి అప్పలనాయుడు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేశ్ రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించింది.
తాజాగా ఈ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
చీపురుపల్లి - కళా వెంకట్రావు
భీమిలి - గంటా శ్రీనివాసరావు
పాడేరు (ఎస్టీ) - కిల్లు వెంకట రమేశ్ నాయుడు
దర్శి - గొట్టిపాటి లక్ష్మి
రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం
ఆలూరు - వీరభద్ర గౌడ్
గుంతకల్లు - గుమ్మనూరు జయరామ్
అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
కదిరి - కందికుంట వెంకటప్రసాద్