తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం బుధవారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు నాయుడుకు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం బుధవారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు నాయుడుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా టీడీపీతో అంటిముట్టనట్టుగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు.. నేడు విశాఖకు వచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలకడం ఆసక్తికరంగా మారింది. దీంతో గంటా ఇకపై టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా వ్యవహరిస్తారించనున్నారారనే టాక్ వినిపిస్తోంది.
ఇక, నేటి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసనల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పొందూరు మండలం దళ్లవలసలో నిర్వహించనున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం విశాఖకు చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 4 గంటలకు దళ్లవలస గ్రామం చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని, ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు రాత్రి 9.30 గంటలకు విశాఖ టీడీపీ కార్యాలయానికి చేరుకుని.. రాత్రి అక్కడే బసచేస్తారు.
ఇక, టీడీపీ మహానాడులోపు వివిధ జిల్లాలలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెల 5న భీమిలి నియోజకవర్గంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మే 6న ముమ్మిడివరం నియోజకవర్గం కోరింగలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ కార్యక్రమాలు పూర్తైన తర్వాత మిగిలిన జిల్లాల్లో కూడా చంద్రబాబు పర్యటించే అవకాశం ఉంది. పార్టీ క్యాడర్‌ను క్షేత్ర స్థాయి నుండి ఎన్నికలకు సిద్దం చేయడం కోసం ఈ పర్యటనలు దోహదపడే అవకాశం ఉందని టీడీపీ నాయకత్వం భావిస్తుంది.
