తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు 12 మందితో చంద్రబాబు నేడు సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta srinivasa rao)కు ఆహ్వానం అందింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌ల పదవుల భర్తీ మొదలు పెట్టారు. నియోజకవర్గాలవారీగా సమీక్షలు చేస్తూ.. స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేడు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు 12 మందితో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు ఆహ్వానం వెళ్లింది. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి విశాఖ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta srinivasa rao), లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఇన్‌ఛార్జి పల్లా శ్రీనివాస్, తూరు, పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబులను పిలిచారు.
అయితే ఈ సమావేశానికి గంటా శ్రీనివాస్ డుమ్మా కొట్టారు. త్వరలో వచ్చి చంద్రబాబును కలుస్తానని పార్టీ కార్యాలయానికి ఆయన సమాచారమిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో రాలేకపోతున్నానని చెప్పినట్టుగా సమాచారం.
ఇక, గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితం ఆయన అధికార వైసీపీలో చేరాతరనే సంకేతాలు కనిపించాయి. కొందరు స్థానిక నాయకులు అడ్డుపడటంతో గంటా వైసీపీలో చేరలేకపోయారనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత గంటా సైలెంట్ అయిపోయారు. తన పని తాను చేసుకుంటూ ఉండిపోయారు. అయితే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామాల లేఖను ఏకంగా స్పీకర్‌కు పంపించారు.
ఇది జరిగి ఏడాది గడిచిపోయింది. మరోవైపు గత కొంతకాలంగా కాపు రాజకీయాలతో గంటా శ్రీనివాసరావు బిజీగా ఉన్నారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు నుంచి గంటాకు ఆహ్వానం అందింది. అయితే తర్వాత వచ్చి కలుస్తానని చెప్పి గంటా ఈ భేటీకి డుమ్మా కొట్టారు. మరి ఈ పరిణామాలపై టీడీపీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది.
