ఈరోజో, రేపో వెంటనే సిఎంను కలుస్తారు. గంటాపై ఉన్న ఆరోపణలు, వాటి తాలూకు వివరాలను సిఎం ముందు ఉంచేందుకు చింతకాయల సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా గంటాకు వ్యతిరేకంగా చింతకాయల బలప్రదర్శనకు కూడా సిద్ధపడుతున్నట్లు సమాచారం.

చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోని విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుపై నేరుగా ముఖ్యమంత్రేకి ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. చింతకాయల వల్లే పార్టీ, ప్రభుత్వపరువు పోతోందని లేఖలో ఆరోపించారు. విశాఖలో వెలుగు చూసిన భూకుంభకోణం విషయంలో చింతకాయల చేసిన బహిరంగ ప్రకటనల వల్లే పార్టీ, ప్రభుత్వం పరువు రోడ్డున పడిందంటూ సిఎంకు రాసిన లేఖలో గంటా పేర్కొన్నారు.

చింతకాయలకు గంటాకు మొదటి నుండి పడదు. ఒకరిపై మరొకరు పై చేయి సాధించటానికి వీరిద్దరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. గడచిన మూడేళ్ళుగా విశాఖపట్నం జిల్లాలో పరిస్ధితి ఇదే. వీరిద్దరి విషయం చంద్రబాబుకు కూడా ఎన్నోమార్లు తలనొప్పులు తెచ్చిపెట్టింది. వీరిద్దరి మధ్య సయోధ్య చేసేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పార్టీలోని కొందరు ఎంఎల్ఏలు, అనకాపల్లి ఎంపి గంటాకు మద్దుతుగా నిలుస్తున్నారు. మరికొందరు ఎంఎల్ఏలు, జిల్లా పార్టీలోని మెజారిటీ నేతలు చింతకాయలకు మద్దతుగా నిలిచారు.

తాజాగా బయటపడిన భారీ భూ కుంభకోణంలో మంత్రితో పాటు పలువురు ఎంఎల్ఏలు భాగస్వాములంటూ చింతకాయల బహిరంగంగానే ఆరోపించారు. అప్పట్లో పార్టీ, ప్రభుత్వంలో అదో పెద్ద సంచలనం. తర్వాతే కుంభకోణం చుట్టూ రాజకీయం స్పీడందుకున్నది. చివరకు అదే కుంభకోణం చంద్రబాబు ప్రభుత్వానికి బాగా ఇబ్బందిగా తయారైంది.

అదే విషయాన్ని గంటా తన లేఖలో పేర్కొన్నారు. కుంభకోణం విషయంలో చింతకాయల బహిరంగ ప్రకటనలు చేయటం ద్వారా పార్టీ పరువు మసకబారిందని ఆరోపించారు. భూస్కాంపై సిబిఐతో విచారణ జరిపించాలని కూడా గంటా కోరారు.

తనపై గంటా సిఎంకు ఫిర్యాదు చేసిన తర్వాత చింతకాయల ఎందుకు ఊరుకుంటారు? ఈరోజో, రేపో వెంటనే సిఎంను కలుస్తారు. గంటాపై ఉన్న ఆరోపణలు, వాటి తాలూకు వివరాలను సిఎం ముందు ఉంచేందుకు చింతకాలయ సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా గంటాకు వ్యతిరేకంగా చింతకాయల బలప్రదర్శనకు కూడా సిద్ధపడుతున్నట్లు సమాచారం.

ఇద్దరిలో ఎవరిపైనా చంద్రబాబు చర్యలు తీసుకునే స్ధితిలో లేరు. దాంతో ఇద్దరూ రెచ్చిపోతున్నారు. వీరిద్దరి మధ్య వివాదాలు చివరకు జిల్లా మొత్తం మీద పార్టీ పుట్టి ముంచినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇతర నేతలు ఆందోళన చెందుతున్నారు.