గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆ నియోజకవర్గంతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. వంశీ రాసిన లేఖపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తాను అండగా ఉంటానని.. అధైర్యపడొద్దని ప్రజా మద్ధతుతో అధికార పక్షాన్నీ ఢీకొడదామని ఆయన భరోసా ఇచ్చారు.

వంశీ సైతం తన ఆవేదనను అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వల్లభనేని వంశీ మౌనం దాల్చడంతో ఆయన నిర్ణయం ఏంటా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

అధినేత భరోసా మేరకు మనసు మార్చుకుంటారా..? లేదంటే వైసీపీలోకి వెళతారా.. రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటూ గన్నవరంలో చర్చ నడుస్తోంది. వంశీని బుజ్జగించేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు.

Also Read:వల్లభనేని వంశీ ఎపిసోడ్: ఆ ఎమ్మెల్యే కూడా టచ్‌లో ఉన్నారన్న బీజేపీ

విజయవాడ ఎంపీ కేశనినేని నాని, బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను వంశీ వద్దకు పంపారు. అయితే వల్లభనేని హైదరాబాద్‌లో ఉండటంతో వీరిని కలవలేకపోయారు. కానీ నారాయణతో మాత్రం ఫోన్‌లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. చర్చలకు తాను సిద్ధమేనని వంశీ ఆయనతో చెప్పినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబు ప్రయత్నాలు ఇలా వుండగానే.. వంశీ వైసీపీలో చేరడం ఖాయమన్న ప్రచారమూ జరుగుతోంది. వల్లభనేని వంశీ తుది నిర్ణయం ఏంటో తెలుసుకునే వరకు ఆయనను ఉద్దేశిస్తూ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు. మంగళవారం జరిగే చర్చలకు వంశీ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అటు వంశీ ప్రత్యర్ధి.. గన్నవరం వైసీపీ ఇన్‌ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు శిబిరంలోనూ వల్లభనేని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వంశీ విషయంపై ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడేందుకు యార్లగడ్డ ఆయన అపాయింట్‌మెంట్ కోరారు.

Also Read:జగన్ తో వల్లభనేని వంశీ భేటీ వెనక... టీడీపీ జిల్లా నాయకత్వంపై కార్యకర్తలు ఫైర్

అయితే సోమవారం రాత్రి వరకు వెంకట్రావు తన అధినేతను కలవలేకపోయారు. మంగళవారం వీరిద్ధరి భేటీ జరిగే అవకాశం ఉంది. వంశీ వైసీపీలోకి వస్తే పార్టీలో తమ  మనుగడ కష్టమని.. అధికారంలో ఉన్న సమయంలో తమను ఎన్నో రకాలుగా వంశీ వేధింపులకు గురిచేశారని.. వెంకట్రావు ఈ విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది.

వల్లభనేని వంశీ వైసీపీలో చేరిన పక్షంలో తాను మరో ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిందేనని చెబుతున్నారు. అయితే యార్లగడ్డ, వల్లభనేని మధ్య రాజీ కుదర్చాలని సీఎం జగన్ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. వెంకట్రావుకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేందుకు వైసీపీ అధినేత సముఖంగా వున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా వెంకట్రావుకు చేరవేశారని సమాచారం. అయితే వల్లభనేని వంశీ వైసీపీలో చేరేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. నవంబర్ 3న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారని కొందరు నేతలు చెబుతున్నారు.

Also Read:వల్లభనేని వంశీ ఎఫెక్ట్, అఖిలప్రియ భర్తపై కేసు: జగన్ పై చంద్రబాబు భగ్గు

వంశీ రాజీనామాతో ఉపఎన్నికలు వస్తే గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయాలని యార్లగడ్డ వెంకట్రావు భావిస్తున్నారు. మొత్తం మీద వంశీ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత టీడీపీ నేతలతో జరిపే చర్చలను బట్టి ఇరు పార్టీల వ్యూహాలు వుండే అవకాశం వుంది. అప్పటి వరకు సస్పెన్స్ తప్పదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.