అమరావతి: అక్రమ కేసులతో టీడీపీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వైసీపీపై ఆరోపణలు చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మంగళవారం నాడు పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలి కాన్పరెన్స్ నిర్వహించారు.

వైసిపి ప్రభుత్వ వేధింపులపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన పార్టీ క్యాడర్‌కు సూచించారు. పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై  వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందన్నారు.

రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ బృందం ఇవాళ రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.నవంబర్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో మానవ హక్కుల బృందం పర్యటిస్తోందన్నారు. టీడీపీ ఎంపీలు హ్యమున్ రైట్స్  కమిషన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. దానికి స్పందనగానే రాష్ట్రంలో హ్యుమన్ రైట్స్ ప్రతినిధుల బృందం పర్యటిస్తోన్న విషయాన్ని చంద్రబాబునాయుడు చెప్పారు.

ఆత్మకూరు,జంగమేశ్వరపాడు,పిన్నెల్లి,పొనుగుపాడులలో హ్యుమన్ రైట్స్ కమిషన్ సభ్యులు పర్యటించనున్నారని చంద్రబాబునాయుడు చెప్పారు. వైసీపీ బాధితులంతా మానవ హక్కుల బృందాన్ని కలవాలని చంద్రబాబునాయుడు సూచించారు.

 గత ఐదు మాసాల్లో  రాష్ట్ర వ్యాప్తంగా 620 చోట్ల  వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. హత్యలు, భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసం తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పారు.

 పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారని,   నెలరోజుల్లో తీయిస్తామని శాసనమండలిలో హామీ ఇచ్చారు. 4నెలలైనా పొనుగుపాడు గోడ తీయించలేదు. ఇది చూసి మిగిలిన చోట్లకూడా వైసిపి నేతలు రెచ్చిపోతున్నారని చంద్రబాబు చెప్పారు. 

అనంతపురం జిల్లా వెంకటాపురంలో కూడా గోడలు కట్టారు. టిడిపి కార్యకర్తలు అక్కులప్ప, నాగరాజు ఇళ్ల చుట్టూ గోడలు కట్టారు. ఈ అరాచకాలన్నీ హ్యూమన్ రైట్స్ బృందానికి వివరించాలని పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు.

రాష్ట్రంలో ఇసుక సంక్షోభం మానవ తప్పిదమేనని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతల స్వార్ధానికి భవన నిర్మాణ కార్మికులు బలౌతున్నారని ఆయన చెప్పారు. లక్షలాది భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధిని కోల్పోయారని ఆయన అభిప్రాయపడ్డారు.

స్వంత గ్రామంలోని వాగులో ఇసుక తెచ్చుకోవడానికి కూడ అనేక అడ్డంకులు సృష్టించారని ఆయన విమర్శించారు. పది రెట్లు ఎక్కువ ధరకు ఇసుకను విక్రయిస్తున్నారని చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ఆన్‌లైన్‌లో  ఇసుక అమ్మకాలు జగన్మాయగా మారాయని ఆయన విమర్శించారు.

అరగంటలోనే నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు.చెన్నై, బెంగుళూరు, హైద్రాబాద్‌కు  ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని  చంద్రబాబునాయుడు విమర్శించారు. 

రాజధానిపై ఇంకో కమిటీ వేశారు ఈ కమిటీకి సూచనలను ఇవ్వాలని ప్రభుత్వం కోరడాన్ని చంద్రబాబునాయుడు తప్పు బట్టారు. గోదావరి, కృష్ణా నదులు అనుసంధానాన్ని రివర్స్ చేస్తున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులకు వచ్చిన వరదల ద్వారా 4 వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో వృధాగా పోయిన  తర్వాత జలాశయాల్లో నీరు ఎందుకు నింపలేదని  సీఎం జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని  చంద్రబాబునాయుడు చెప్పారు.

టీడీపీ నిర్మించిన భవనాలకు వైసీపీ రంగులేస్తోందని  చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ చేసిన అభివృద్ధిని చెరిపేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని చంద్రబాబునాయుడు చెప్పారు.