విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా వైరస్ సోకింది. గత కొద్ది రోజులుగా ఆయన గ్రామాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఆ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వచ్చారు. తిరుమలకు వెళ్లి వచ్చిన తర్వాత వంశీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. 

శనివారంనాడు ఆయనకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. వైద్యుల సూచన మేరకు ఆయన 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయవర్గాలు చెప్పాయి.

ఇదిలావుంటే, శనివారంనాటి లెక్కల ప్రకారం.... ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,342 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 8,04,026కి చేరింది. నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,566కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో 3,572 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 7,65,991కి చేరింది.ప్రస్తుతం ఏపీలో 31,469 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 74,919 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 75,02,933కి చేరుకుంది.

 ఒక్కరోజే అనంతపురం 131, చిత్తూరు 404, తూర్పు గోదావరి 445, గుంటూరు 378, కడప 203, కృష్ణ 344, కర్నూలు 60, నెల్లూరు 98, ప్రకాశం 266, శ్రీకాకుళం 112, విశాఖపట్నం 244, విజయనగరం 106, పశ్చిమ గోదావరిలలో 551 కేసులు నమోదయ్యాయి.

అలాగే చిత్తూరు, గుంటూరు, కృష్ణలలో నలుగురు.. అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖపట్నంలలో ఇద్దరు... కడప, ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కరు చొప్పున మరణించారు.