పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం. కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీల ప్రాబల్యం గన్నవరం రాజకీయాల్లో ఎక్కువగా వుండేది... కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఈ పరిస్థితి మారింది. గన్నవరం ప్రజలు టిడిపికి అండగా నిలవడంతో 1983 నుండి 2019 వరకు ఐదుసార్లు ఈ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపి నుండి గెలిచి వైసిపిలో చేరారు. ఆయనపై వైసిపి నుండి పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరారు. ఇలా ఇద్దరు నేతలు పార్టీలు మారడంతో గన్నవరం పోరు రసవత్తరంగా మారింది. 

గన్నవరం రాజకీయాలు : 

గన్నవరం పేరుకే నియోజకవర్గం... ఇది విజయవాడలో భాగమేనని అందరికీ తెలుసు. విజయవాడ విమానాశ్రయం ఈ గన్నవరంలోనే వుంది. గన్నవరం ప్రజలు ఏ అవసరం వున్నా వెళ్లేది విజయవాడకే... అందువల్లే ఈ నియోజకవర్గ రాజకీయాలపై బెజవాడ ప్రభావం ఎక్కువగా వుంటుంది. గతంలో జరిగిన ఎన్నికలు, ఫలితాలను పరిశీలిస్తే గన్నవరంలో టిడిపిదే పైచేయిగా వుంది. ఇక్కడ ఇప్పటివరకు గన్నవరం అసెంబ్లీకి 15సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు టిడిపి, 4 సార్లు కాంగ్రెస్, 3 సార్లు కమ్యూనిస్టులు, ఇతరులు మూడుసార్లు గెలిచారు... ఇక్కడ ఇప్పటివరకు వైసిపి గెలవలేదు. కానీ 2019 లో టిడిపి నుండి గెలిచిన వల్లభనేని వంశీ వైసిపిలో చేరారు... దీంతో ప్రస్తుతం గన్నవరం వైసిపి చేలిలో వుందన్నమాట. 

అసెంబ్లీ ఎన్నికలు 2024 లో గన్నవరంలో పోరు రసవత్తరంగా సాగనుంది. 2019 లో టిడిపి నుండి పోటీచేసిన అభ్యర్థి ఈ ఎన్నికల్లో వైసిపి తరపున, వైసిపి నుండి పోటీచేసిన అభ్యర్థి టిడిపి తరపున పోటీ చేస్తున్నారు. దీంతో గన్నవరం ప్రజలు ఎవరికి మద్దతిస్తారు? ఏ పార్టీని గెలిపిస్తారు? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. 

గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. ఉంగుటూరు 
2. బాపులపాడు
3. విజయవాడ రూరల్ 
4. గన్నవరం

గన్నవరం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ‌- 2, 77,132

గన్నవరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి : 

గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే వైసిపి బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. టిడిపి నుండి వైసిపిలో చేరిన ఈయన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో వంశీ అయితేనే టిడిపిని గట్టిగా ఎదుర్కోగలడని అతడికే గన్నవరం టికెట్ ఇవ్వాలని వైసిపి అదిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

టిడిపి అభ్యర్థి : 

గన్నవరం అసెంబ్లీ బరిలో టిడిపి తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేయనున్నారు. ఇలా వైసిపిలోంచి టిడిపిలో చేరి అలా టికెట్ పట్టేసారు యార్లగడ్డ. 

గన్నవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

గన్నవరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

పోలయిన మొత్తం ఓట్లు - 2,20,718 (80 శాతం)

టిడిపి- వల్లభనేని వంశీమోహన్ - 1,03,881(47 శాతం) - 838 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం 

వైసిపి - యార్లగడ్డ వెంకట్రావు - 1,03,043 (46 శాతం) - ఓటమి 

గన్నవరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు : 

టిడిపి - వల్లభనేని వంశీమోహన్ - 99,163 (49 శాతం) - 9,548 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - దుట్టా రామచంద్రరావు - 89,615 (44 శాతం) - ఓటమి