తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతంల్లో విచ్చలవిడిగా గంజాయిని సరఫరా చేస్తున్న స్మగ్లర్ల ముఠాను రాజధాని పోలీసులు వలపన్ని అరెస్ట్ చేశారు. సినిమా స్టైల్లో గంజాయి ముఠా గుట్టురట్టుచేసిన తాడేపల్లి పోలీసులు భారీగా గంజాయి నిల్వలను స్వాదీనం చేసుకున్నారు. 

విజయవాడ,వైజాగ్, ఏలూరు కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయ్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తాడేపల్లి పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. తాడేపల్లి లోని కెఎల్ రావు కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి ఇతరప్రాంతాల నుండి భారీగా గంజాయిని తీసుకువచ్చి రాజధాని ప్రాంతంలో అమ్ముతున్నాడు. గంజాయి కోసం ఏకంగా ఓ గోదాంను నిర్వహిస్తున్నాడు. 

read more   బూతులు తిడుతూ... చొక్కా విప్పి వీరంగం: మహిళా ఎస్సైతో వార్డు వాలంటీర్ అసభ్య ప్రవర్తన

ఈ గంజాయి విక్రయంపై సమాచారం అందుకున్న పోలీసులు సినిమా స్టైల్లో వలపన్ని అతన్ని పట్టుకున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గంజాయ్ మూలాలను గుర్తించి అక్రమంగా నిల్వవుంచిన భారీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా 92 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 

మొత్తంగా గంజాయి అక్రమ రవాణాతో సంబంధమున్న మూడు జిల్లాలకు చెందిన 8 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి  కేసును ఛేదించిన తాడేపల్లి పోలీస్ సిబ్బందిని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు.