గంజాయి స్మగ్లర్ల అడ్డాగా గన్నవరం... భారీ సరుకుతో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర ముఠా
ఒరిస్సా నుండి గుజరాత్ కు గంజాయిని తరలిస్తూ గన్నవరంలోకి ఓ ఇంట్లో బసచేసిన అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేసారు.
గన్నవరం : ఆంధ్ర ప్రదేశ్ లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది. ఓ కారులో భారీగా గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. గన్నవరంలో ఓ ఇంట్లో బసచేసిన స్మగ్లర్లను అరెస్ట్ చేసి 100 కిలోల గంజాయి, తరలించేందుకు ఉపయోగిస్తున్న కారును
స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరంలోని సెయింట్ జాన్స్ హైస్కూల్ సమీపంలోని ఓ ఇంటిని గంజాయి స్మగ్లర్లు అడ్డాగా చేసుకున్నారు. గుజరాత్ కు చెందిన ఓ కుటుంబం ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేసేందుకు గన్నవరం వచ్చినట్లు చెప్పి ఆ ఇంటిని అద్దెకు తీసుకుంది. కానీ ఆ ఇంటిని గంజాయి స్మగ్లింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ విషయం కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు తెలిసిపోయింది.
అయితే గంజాయి స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు గన్నవరంలోని ఆ ఇంటిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే గురువారం ఒరిస్సా నుండి గుజరాత్ కు ఓ కారులో దాదాపు 100 కిలోల గంజాయిని తరలిస్తూ నలుగురు యువకులు గన్నవరం వచ్చారు. ఎప్పటిలాగే విద్యానగర్ లో అద్దెకు తీసుకున్న ఇంటికి చేరుకుని బస చేసారు. స్మగ్లింగ్ ముఠా రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసారు. పోలీసుల రాకను పసిగట్టిన ఇద్దరు యువకులు తప్పించుకుని పరారవగా మిగతా ఇద్దరు పట్టుబడ్డారు.
Read More జైలులోని ఖైదీకి గంజాయి తీసుకెళ్లుతూ పట్టుబడ్డ కానిస్టేబుల్
ఇంటిముందు నిలిపిన కారును తనిఖీ చేసిన పోలీసులు భారీగా గంజాయిని గుర్తించారు. వెంటనే ఆ గంజాయితో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిని ఇద్దరు స్మగ్లర్లను జైలుకు తరలించి పరారయిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.